చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు మోహనరావు కన్నుమూత
- 82 ఏళ్ల వయసులో విశాఖపట్నంలో ఈ ఉదయం తుదిశ్వాస
- కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహనరావు
- తెలుగు రాష్ట్రాల్లో వస్త్రవ్యాపారంలో చెరగని ముద్ర వేసిన వ్యాపారవేత్త
చందన మోహనరావు తన వ్యాపార దక్షతతో సీఎంఆర్, చందన బ్రదర్స్ బ్రాండ్లను తెలుగు ప్రజలకు చేరువ చేశారు. ఆయన స్థాపించిన ఈ షాపింగ్ మాల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, పట్టణాల్లో విస్తరించి, వస్త్ర వ్యాపార రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
నాణ్యత, విభిన్న రకాల వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థలు, ముఖ్యంగా మహిళా వినియోగదారుల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నాయి. మోహనరావు మరణ వార్త తెలియగానే వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.