Gaddam Krishna: నల్గొండలో దారుణం.. ప్రేమ పేరుతో విద్యార్థినిపై అత్యాచారం.. రక్తస్రావంతో మృతి

Student Raped and Murdered in Nalgonda Gaddam Krishna Arrested
  • ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడిన యువకుడు
  • ప్రధాన నిందితుడు కృష్ణ, అతడి స్నేహితుడు మధు అరెస్ట్
  • సోషల్ మీడియా ద్వారా పరిచయమై పక్కా ప్లాన్‌తో ఘాతుకం
  • పోక్సో సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు
ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిని నమ్మించి, అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దారుణ ఘటన నల్గొండలో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రోజూ ఆటోలో కాలేజీకి వెళ్లేది. అదే గ్రామంలో మూడు నెలల క్రితం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన గడ్డం కృష్ణ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిత్యం చాటింగ్ చేస్తూ, ప్రేమ పేరుతో ఆమెను మభ్యపెట్టాడు.

ఈ నెల 7వ తేదీన బాలిక రోజూలాగే ఆటోలో కాలేజీకి బయలుదేరింది. ఉదయం 8:30 గంటల సమయంలో డీఈవో ఆఫీసు చౌరస్తా వద్దకు ఆటో చేరుకోగానే పథకం ప్రకారం బైక్‌పై అక్కడ వేచి ఉన్న కృష్ణ ఆమెను ఆటో నుంచి దింపాడు. తన బైక్‌పై తీసుకెళ్తే గ్రామస్థులు ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంతో తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ బచ్చలకూరి మధు వాహనంలో బాలికను ఎక్కించాడు. మధు ఆమెను షంషూనగర్‌లోని కృష్ణ అద్దెకు ఉంటున్న గది వద్దకు తీసుకెళ్లాడు.

అనంతరం కృష్ణ ఆ గదికి చేరుకుని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భయపడిపోయిన కృష్ణ, గదికి తాళం వేసి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని అతడు ఓ తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఈ సమాచారం బాలిక తల్లిదండ్రులకు, పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కృష్ణ పోలీసులకు లొంగిపోగా, అతడి స్నేహితుడు మధును కూడా అదుపులోకి తీసుకున్నారు.

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు గడ్డం కృష్ణపై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), పోక్సో చట్టంలోని సెక్షన్లు 5, 6, హత్యకు సంబంధించి బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. అతడికి సహకరించిన మధుపై బీఎన్ఎస్ సెక్షన్ 107 కింద కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.
Gaddam Krishna
Nalgonda
student rape case
murder
Bachalakuri Madhu
crime news
telangana news
POCSO Act
Shamsunagar
inter student

More Telugu News