జూన్ 4న వెన్నుపోటు దినం..విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సజ్జల
- జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
- పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్
- ఎన్నికల హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమమని వెల్లడి
వైకాపా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సజ్జల కోరారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సజ్జల సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైకాపా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.