Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్: తెలంగాణలో మీటర్ మేర పడిపోయిన భూగర్భ జలాలు

El Nino effect Groundwater levels in Telangana dropped by a meter
  • ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తగ్గిన వర్షపాతం
  • వరి సాగు తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచన
  • పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం 27 మందితో నిపుణుల కమిటీ ఏర్పాటు
  • ప్రజా భవన్‌లో జరిగిన మొదటి సమావేశంలో కీలక అంశాలపై చర్చ
ఎల్‌ నినో ప్రభావంతో ఈ ఏడాది తెలంగాణలో వర్షపాతం గణనీయంగా తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షపాతం, భూగర్భ జలాల లభ్యత, అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను నిరంతరం విశ్లేషిస్తూ, పంటల సరళిలో మార్పుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి సూచించారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సుమారు ఒక మీటర్ మేర క్షీణించిందని ఆయన తెలిపారు. రైతుల ప్రయోజనార్థం జిల్లా స్థాయి ప్రత్యేక సలహాలను, పంటల యాజమాన్య వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం 27 మంది సభ్యులతో ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అధ్యక్షతన బుధవారం ప్రజా భవన్‌లో ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. భారత వాతావరణ విభాగం, ఇక్రిశాట్, ఇకార్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలతో పాటు పలు ప్రముఖ సంస్థల నిపుణులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, పంటల మార్పిడి, కరవును తట్టుకునే చిరుధాన్యాల సాగు, సమర్థవంతమైన నీటి యాజమాన్యం, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి కీలక అంశాలపై నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు.
Advertisement
Telangana
El Nino effect
Groundwater levels
Telangana Agriculture
Alternative crops

More Telugu News