లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్ భార్య‌పై ట్రోలింగ్‌... జాతీయ మహిళా కమిషన్ సీరియ‌స్‌
Add ap7am to your home Screen

లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్ భార్య‌పై ట్రోలింగ్‌... జాతీయ మహిళా కమిషన్ సీరియ‌స్‌

NCW Condemns Trolling of Lieutenant Vinay Narwals Wife Himanshi Narwal
  • ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్ 
  • ఈ ఘ‌ట‌న నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీల‌ను నిందించొద్ద‌న్న భార్య‌ హిమాన్షీ
  • ఆమె వ్యాఖ్య‌ల‌పై ట్రోల్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లువురు పోస్టులు
  • భ‌ర్త‌ను కోల్పోయిన మ‌హిళ‌ను విమ‌ర్శించ‌డం బాధాక‌ర‌మ‌న్న ఎన్‌సీడ‌బ్ల్యూ
ఏప్రిల్ 22న జ‌మ్మూకశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిలో లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్ ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీల‌ను నిందించొద్ద‌ని ఆయ‌న భార్య‌ హిమాన్షీ న‌ర్వాల్ ఇటీవ‌ల కోరారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తూ ప‌లువురు పోస్టులు పెట్టారు.   

ఈ విష‌యంపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (NCW) సీరియ‌స్ అయింది. భ‌ర్త‌ను కోల్పోయిన మ‌హిళ‌ను విమ‌ర్శించ‌డం బాధాక‌ర‌మ‌ని, త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసే హ‌క్కు ఆమెకు ఉంద‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ వ్యాఖ్యానించింది. ట్రోలింగ్ చేసేవారు త‌మ వ్యాఖ్య‌ల‌ను అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని హెచ్చ‌రించింది. ఇలాంటివి ఏమాత్రం స‌హించ‌ద‌గిన‌వి కావ‌ని పేర్కొంది.    

"జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో చాలా మంది పౌరులు మరణించారు. ఇతర వ్యక్తులతో పాటు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను అతని మతం గురించి అడిగారు. ఆ తర్వాత‌ కాల్చి చంపారు. ఈ దాడితో యావ‌త్‌ దేశం బాధపడుతోంది. భార‌త జాతి మొత్తం ఆగ్రహానికి గురైంది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తరువాత అతని భార్య హిమాన్షీ నర్వాల్‌ను ల‌క్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమ‌ర్శించ‌డం అనేది తీవ్రంగా ఖండించదగినది, దురదృష్టకరం. ఒక మహిళగా త‌న‌ అభిప్రాయాలను వెల్ల‌డించే హ‌క్కు ఆమెకు ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమెను ట్రోల్ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడటానికి జాతీయ మహిళా కమిషన్ కట్టుబడి ఉంది" అని ఎన్‌సీడ‌బ్ల్యూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) పోస్ట్‌లో పేర్కొంది.

"కొంతమందికి హిమాన్షీ వ్యాఖ్యలు నచ్చకపోవచ్చు. కానీ ఆమె అభిప్రాయాలను ట్రోల్ చేయడం, వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమెను లక్ష్యంగా చేసుకోవడం సరైన‌ది కాదు" అని ఎన్‌సీడ‌బ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. 

ఇక‌, ఉగ్రవాద దాడికి కొన్ని రోజుల ముందు వివాహం చేసుకున్న లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్, హిమాన్షీ జంట, తమ హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లారు. ప‌హ‌ల్గామ్‌లో ఈ 26 ఏళ్ల ఈ నేవీ అధికారితో పాటు 26 మంది దారుణ హత్యకు గురయ్యారు. తన భర్త మృతదేహం పక్కన కూర్చుని హిమాన్షీ ఏడ్చిన‌ హృదయ విదారక దృశ్యాలు యావత్ దేశాన్ని కదిలించాయి.

హిమాన్షీ న‌ర్వాల్‌ ఏమ‌న్నారంటే..!
దాడి తర్వాత ఆమె మొదటిసారిగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెపై ట్రోలింగ్‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీల‌ను నిందించొద్ద‌ని ఆమె దేశానికి విజ్ఞప్తి చేశారు. "దేశం మొత్తం అతని కోసం (వినయ్) ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా అతనికి శాంతి లభించాలి. నేను అడుగుతున్నది అదే. అలాగే నేను చెప్పాలనుకుంటున్నది ఇంకొకటి ఉంది. ముస్లింలు, కశ్మీరీలపై ద్వేషం పెరుగుతోంది. మేము దీన్ని కోరుకోవడం లేదు. మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాము. మరేమీ కాదు" అని హిమాన్షీ న‌ర్వాల్ అన్నారు. 

అలాగే దాడి వెనుక ఉన్న వారిని శిక్షించి, బాధితుల‌కు న్యాయం చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇలా ఆమె శాంతి కోసం చేసిన విజ్ఞప్తి హిమాన్షీపై ట్రోలింగ్‌కు దారితీసింది. దీంతో తాజాగా ఎక్స్ వేదిక‌గా జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స్పందించింది.   
Advertisement
NCW
Himanshi Narwal
Lieutenant Vinay Narwal
National Commission for Women
Jammu and Kashmir
Terrorist attack
Pahalgham
Social media trolling
India
Viral

More Telugu News