కపిలేశ్వరపురం వచ్చిన చిరంజీవి.. కూటమి ప్రభుత్వ పాలనపై వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

కపిలేశ్వరపురం వచ్చిన చిరంజీవి.. కూటమి ప్రభుత్వ పాలనపై వ్యాఖ్యలు

Chiranjeevi visits Kapileswarapuram and comments on Alliance government governance
  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చిరంజీవి
  • ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్
  • రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్య
  • పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు దేశంలో మొదటి ర్యాంక్ వచ్చిందని వెల్లడి
  • ప్రజలకు ఇలాగే మంచి జరగాలని ఆకాంక్ష
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని ఆయన కితాబిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం పర్యటన సందర్భంగా ఆయన స్థానికులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఏపీలో పాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వచ్చానని, ఇక్కడ పాలన ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నానని చిరంజీవి చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయని ప్రజలు తనకు చెప్పినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా తన సోదరుడు పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో దేశవ్యాప్తంగా 23వ ర్యాంకులో ఉన్న పంచాయతీరాజ్ శాఖ, ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పరోక్షంగా సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇలాగే మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీఎస్ఎల్ హాస్పిటల్, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించిన వైద్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం చిరంజీవి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి ముదిరిన తర్వాతే చాలామంది మేల్కొంటున్నారని, లక్షణాలను ముందుగా గుర్తిస్తే సులభంగా కోలుకోవచ్చని సూచించారు. తన భార్య, సోదరి, తల్లికి క్రమం తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయిస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

నటుడు మురళీమోహన్ ఆరోగ్యాన్ని చూశాక, తాను కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానని చిరంజీవి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ, తాను హైదరాబాద్ నుంచి గాజు వాటర్ బాటిళ్లను తెచ్చుకుంటానని చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరవడంతో మెగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఛైర్మన్ గన్ని భాస్కర్ రావు, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జీవీబీ చౌదరి, పలువురు మంత్రులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Chiranjeevi
Andhra Pradesh Government
Pawan Kalyan
Panchayati Raj Department
Kapileswarapuram East Godavari
Cancer Awareness

More Telugu News