కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్
- పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తత
- హాట్‌లైన్‌లో ఇరు దేశాల డీజీఎంఓల చర్చలు, పాక్‌కు భారత్ హెచ్చరిక
- నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
- భారత బలగాలు దీటుగా స్పందించాయని రక్షణ వర్గాల వెల్లడి
- భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ, విశ్వాసం
గత ఆరు రోజులుగా ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్, తాజాగా జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ఏప్రిల్ 29-30 రాత్రులతో పాటు, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి, పర్గ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడిందని, భారత సైనిక బలగాలు దీనికి తగిన రీతిలో స్పందించాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులు జరగడం అరుదని, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రతరం చేసిందని భావిస్తున్నారు.