Tourist: జిప్‌లైన్‌పై పర్యాటకుడి కేరింత.. తనకు తెలియకుండానే ఉగ్రదాడి రికార్డు... ఇదిగో వీడియో

Tourists Joyride Captures Pahalgham Terrorist Attack
  • పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కొత్త వీడియో వెలుగులోకి!
  • జిప్‌లైన్ రైడ్‌లో సెల్ఫీ వీడియో తీస్తుండగా ఘటన నమోదు
  • తుపాకీ శబ్దాలు, కేకలు, వ్యక్తి పడిపోవడం వీడియోలో రికార్డ్
  • జరుగుతున్న దాడిని గుర్తించని పర్యాటకుడు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు. సరదాగా తీసుకున్న సెల్ఫీ వీడియోలో దాడికి సంబంధించిన దృశ్యాలు, శబ్దాలు రికార్డు కావడంతో కలకలం రేగుతోంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తి పహల్గామ్‌లోని ప్రసిద్ధ బైసరన్ వ్యాలీని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, థ్రిల్ కోసం జిప్‌లైన్ రైడ్ చేశాడు. ఈ సమయంలో గాల్లో వేగంగా ప్రయాణిస్తూ, తన అనుభూతిని సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరించుకున్నాడు. తాను కేరింతలు కొడుతూ రైడ్‌ను ఆస్వాదిస్తున్న దృశ్యాలను రికార్డు చేస్తుండగా, అదే సమయంలో దిగువ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.

ఆ వీడియోను పరిశీలించగా, జిప్‌లైన్‌పై పర్యాటకుడు సరదాగా గడుపుతున్న సమయంలోనే కింద తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రజల హాహాకారాలు, వరుసగా పేలుతున్న తుపాకీ శబ్దాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉగ్రవాదుల కాల్పుల కారణంగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి నేలకొరిగిన దృశ్యం కూడా అందులో నమోదైంది. అయితే, జిప్‌లైన్‌పై వేగంగా ప్రయాణిస్తున్న ఆ పర్యాటకుడు మాత్రం కింద జరుగుతున్న ఈ దారుణాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయాడు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనకు ముందు జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
Tourist
Pahalgham Attack
Jammu and Kashmir
Terrorist Attack
Zipline Video
Viral Video
India Terrorist Attack
NIA Investigation
Selfie Video
Accidental Footage

More Telugu News