నీటి వాటాలపై ఏపీతో గట్టిగా తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ
- సుదీర్ఘకాలంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాలపై వివాదం
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ
- అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో తెలంగాణ తన వాదనను బలంగా వినిపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నీటి పంపకాల విషయంలో స్పష్టత రాకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయపరంగా పోరాడి తమ హక్కులను కాపాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలతో ఏపీ వాదనలకు దీటుగా బదులిస్తారని తెలంగాణ ధీమాగా ఉంది.