Advertisement

ఢిల్లీలో జరిగిన నీట్ ఆందోళనల్లో కేసీఆర్ ఎందుకు లేరు?: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud questions KCR absence from Delhi NEET protests
  • బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారీ ఒప్పందం ఉందన్న మహేశ్ గౌడ్
  • వారి ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపణ
  • రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను వాడుకున్నారని విమర్శ

ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో ఉన్న లోపాయకారీ ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపలేకపోయారని ఆయన విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకుని, వారి ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీల వలే బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందనేది పచ్చి నిజమని, అందుకే గడిచిన పదేళ్లలో బీజేపీ ప్రతిపాదించిన బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లకపోయినా, నీట్ ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచారని అన్నారు.


నెల రోజులుగా నీట్ సమస్యపై స్పందించని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద కూర్చుని నాటకాలు ఆడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోకి వెళ్లే ధైర్యం వారికి ఉందా అని నిలదీశారు. గత పాలనలో ఎంతోమంది విద్యార్థుల బలవన్మరణాలకు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరుద్యోగులను వాడుకున్నారని విమర్శించారు.


గత ప్రభుత్వ హయాంలో సాగిన పోలీసు రాజ్యం, విచ్చలవిడిగా జరిగిన ఇసుక మాఫియా దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన ధ్వజమెత్తారు. నీళ్ల ప్రాజెక్టుల గురించి హరీశ్ రావు మాట్లాడుతున్నారని, కానీ వారి పాలనలో నీళ్ల పేరుతో జరిగిన భారీ దోపిడీ, అక్రమాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని స్పష్టం చేశారు.

Advertisement
Mahesh Kumar Goud
KCR
NEET Protests Delhi
BRS BJP Secret Alliance
Telangana Politics
TPCC President

More Telugu News