Advertisement

యువత భవిష్యత్తే మోదీకి పరమావధి: పీవీఎన్ మాధవ్

PVN Madhav says youth future is Narendra Modi top priority
  • విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందన్న మాధవ్
  • గతంలో పోలిస్తే పేపర్ లీకేజీలు బాగా తగ్గాయని వెల్లడి
  • నీట్ సాకుతో సుప్రీంకోర్టుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును పరమావధిగా చేసుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాలను నెలకొల్పడంతో పాటు మెడికల్ సీట్లను భారీగా పెంచిందని వివరించారు. గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే తమ పాలనలోనే విద్యా పేపర్ లీకేజీలు గణనీయంగా తగ్గాయని, నీట్ వ్యవహారంలో సమస్య వెలుగుచూడగానే కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు.  


నీట్ వివాదాన్ని సాకుగా చూపి కొందరు విపక్ష నేతలు ఢిల్లీ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీట్ సాకుతో ప్రధానితో పాటు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నటుడు ప్రకాశ్ రాజ్ సహా కొందరు విద్రోహకర, దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కొన్ని విద్యా సంఘాలు విద్యార్థుల ప్రయోజనాలను పక్కనబెట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తమ సొంత పాలనలో జరిగిన పేపర్ లీకేజీలపై పార్లమెంట్‌లో మాట్లాడాలని, సభలో చర్చల్లో పాల్గొనే ధైర్యం లేకనే ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని సవాల్ విసిరారు. 


విశాఖ సమీపంలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, ఈ చారిత్రాత్మక ఘట్టంలో 13 వేల మంది కళాకారులతో కూడిన సంప్రదాయ థింసా నృత్యం, బొబ్బిలి వీణా నాదంతో ఆయనకు అద్భుత స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా ఏకంగా 3 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 


భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమంటూ ఏదీ ఉండకూడదనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని, ఆ ప్రాంత సమగ్ర ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును చిరస్థాయిగా నిలిపేందుకే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారని మాధవ్ వివరించారు. 

Advertisement
PVN Madhav
Narendra Modi
Bhogapuram Airport
NEET Controversy
BJP Andhra Pradesh
Alluri Sitarama Raju Airport

More Telugu News