Advertisement

విమానంలో ప్రయాణికుడు చనిపోతే.. ఎయిర్‌లైన్స్ పాటించే సీక్రెట్ ప్రోటోకాల్ ఇదే!

Airlines secret protocol if a passenger dies during flight
  • ముందుగా వైద్య అత్యవసర పరిస్థితిగానే భావిస్తారు
  • సీపీఆర్‌, వైద్యుల సహాయంతో చికిత్స కొనసాగుతుంది
  • వెంటనే విమానం దించాలా అనేది పైలట్ నిర్ణయం
  • మృతదేహాన్ని గౌరవంగా భద్రపరుస్తారు
  • ల్యాండింగ్ తర్వాత అధికారులు బాధ్యతలు చేపడతారు
  • అంతర్జాతీయ విమానాల్లో అదనపు నిబంధనలు అమల్లో ఉంటాయి
విమాన ప్రయాణాల్లో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా కొన్నిసార్లు అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తుతాయి. అరుదైన సందర్భాల్లో ప్రయాణికుడు మరణించినా.. ఎయిర్‌లైన్స్ ముందుగానే రూపొందించిన ప్రత్యేక ప్రోటోకాల్‌ను అమలు చేస్తాయి. మృతుడి గౌరవాన్ని కాపాడటం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడటం, చట్టపరమైన నిబంధనలు పాటించడం ఈ ప్రక్రియలో ప్రధాన లక్ష్యాలు.

ప్రయాణికుడు అపస్మారక స్థితిలో కనిపిస్తే మొదట దాన్ని మరణంగా కాదు.. వైద్య అత్యవసర పరిస్థితిగానే పరిగణిస్తారు. క్యాబిన్ సిబ్బంది వెంటనే సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ అందిస్తారు. విమానంలో వైద్యుడు ఉంటే ఆయన సాయం తీసుకుంటారు. అవసరమైతే భూమిపై ఉన్న వైద్య నిపుణులతో సంప్రదించి సూచనల మేరకు చికిత్స కొనసాగిస్తారు. చాలా దేశాల్లో క్యాబిన్ సిబ్బందికి ప్రయాణికులు మరణించారనే ప్రకటించే అధికారం ఉండదు.

విమానాన్ని వెంటనే దించేయాలా లేదా అనే నిర్ణయం పైలట్ తీసుకుంటారు. ప్రయాణికుణ్ని కాపాడే అవకాశం ఉందా? గమ్యస్థానానికి ఎంత దూరంలో ఉన్నారు? సమీప విమానాశ్రయం పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. మరణం నిర్ధారణై, ఇతర భద్రతా సమస్యలు లేకపోతే సాధారణంగా విమానం గమ్యస్థానానికే చేరుకుంటుంది. ఈ సమయంలో మృతదేహాన్ని ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఖాళీ సీటుకు మార్చి, సీట్‌బెల్ట్‌తో భద్రపరుస్తారు. కుటుంబ సభ్యులు ఉంటే వారికి దగ్గరగా ఉండే అవకాశం కల్పిస్తారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత అత్యవసర వైద్య బృందం, పోలీసులు లేదా సంబంధిత అధికారులు విమానంలోకి వస్తారు. మరణాన్ని అధికారికంగా నిర్ధారించిన తర్వాత స్థానిక చట్టాల ప్రకారం మృతదేహాన్ని తరలిస్తారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే ఎంబసీలు, కాన్సులేట్‌లు, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్ నిబంధనల ప్రకారం అదనపు ప్రక్రియలు ఉంటాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగినప్పటికీ, ప్రతి ఎయిర్‌లైన్ ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను పాటిస్తూ వృత్తిపరంగా వ్యవహరిస్తుంది.
Advertisement
Airlines
In flight death protocol
Aviation safety
Mid air medical emergency
Airline passenger death procedure
Pilot emergency decision

More Telugu News