ఛాంపియన్స్ ట్రోఫీ: తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ కు చుక్కెదురు

Pakistan loses Champions Trophy opener to New Zealand
  • నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
  • ఆరంభ మ్యాచ్ లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్
  • 60 పరుగుల తేడాతో ఓడిపోయిన పాక్
తాను ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కు తొలి మ్యాచ్ లో పరాజయం ఎదురైంది. కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ లో పాక్ జట్టు 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. 

పాక్ జట్టులో కుష్దిల్ షా 69, బాబర్ అజామ్ 63, సల్మాన్ ఆఘా 42, ఫఖార్ జమాన్ 24 పరుగులు చేశారు. పాక్ టెయిలెండర్లలో హరీస్ రవూఫ్ 3 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించినా అది కాసేపే అయింది. పాక్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ సాద్ షకీల్ (6), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓ రూర్కీ 3, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3, మాట్ హెన్రీ 2, బ్రేస్వెల్ 1, నేథన్ స్మిత్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ విల్ యంగ్ (107), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు రెండో మ్యాచ్ లో టీమిండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ లో జరగనుంది.
Advertisement
Champions Trophy 2025
Pakistan
New Zealand

More Telugu News