Harish Rao: ప్రశ్నిస్తే చాలు రేవంత్ రెడ్డి పగబడుతున్నారు: హరీశ్ రావు

Harish Rao lashes out at CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వాన్ని ఎవరైనా అడిగినా... ప్రశ్నించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు అన్యాయం చేశాడని విమర్శించారు. కేసీఆర్ ఉండగా క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించామన్నారు. ఈ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన వాళ్ళను బెదరగొడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో క్రైమ్ రేటు 41 శాతం పెరిగిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంగా... హోంమంత్రిగా ఫెయిల్ అయ్యాడన్నారు. ఏడాదిలో తొమ్మిది మతకల్లోలాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆరు గ్యారెంటీలపై చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.

నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చాడని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా... బీఆర్ఎస్ హయాంలో ఉన్న పథకాలను కూడా బంద్ చేశారన్నారు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావని అడిగితే... రెండు గంటల పాటు చెత్త ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. కౌలు రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఎలాంటి కోతలు లేకుండా ప్రతి కూలీకి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అయిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. మెదక్ జిల్లాలో ఒకేరోజు ముగ్గురు రైతులు, ఏడాది కాంగ్రెస్ పాలనలో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ వస్తున్నారని నిలదీశారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారని, వడ్లు కూడా కొనలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.
Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
Congress
BRS

More Telugu News