నారా లోకేశ్ ను కలిసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు
- దేవర సినిమా పాటకు డ్యాన్స్ వేసి సస్పెన్షన్ కు గురైన డ్రైవర్
- మంత్రి లోకేశ్ చొరవతో సస్పెన్షన్ రద్దు
- కుటుంబంతో సహా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లోవరాజు
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యంలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు 'దేవర' సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసి లోకేశ్ కూడా మెచ్చుకున్నారు.
అయితే, ఈలోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కాస్తా లోకేశ్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోకేశ్ ను లోవరాజు కుటుంబంతో సహా కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.