ప్రచారంలో మహిళను ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎంపీ... వైరల్‌గా మారిన ఫోటో

BJP candidate kisses woman in Bengal during campaign
  • పశ్చిమ బెంగాల్, ఉత్తర మాల్దా నియోజకవర్గంలోని చంచల్‌లోని శ్రీహపూర్ గ్రామంలో ఘటన
  • బీజేపీ ఎంపీపై విమర్శలు గుప్పించిన తృణమూల్ కాంగ్రెస్
  • కూతురు లాంటి అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేమిటన్న బీజేపీ ఎంపీ
  • తృణమూల్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ
పశ్చిమ బెంగాల్ ఉత్తర మాల్దా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ చెంపపై ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆయన సిట్టింగ్ ఎంపీ. 2019లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 84వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. బీజేపీ మళ్లీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని చంచల్‌లో గల శ్రీహపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మహిళను ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ ఈ ఫోటోపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

'మీరు ఇప్పుడు చూస్తోంది నమ్మకపోతే, మేం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం... బీజేపీ ఎంపీ మరియు నార్త్ మాల్దా అభ్యర్థి ఖగేన్ ముర్ము తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దులు పెట్టాడు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అభ్యంతరకర పాటలు రాసే నాయకుల వరకు... మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు ఆ పార్టీలో కొదవలేదు. మహిళల విషయంలో మోదీ పరివార్ ఎలా ఉందో చూడండి. ఇక వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఊహించవచ్చు'నని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ మాల్దా జిల్లా వైస్ ప్రెసిడెంట్ దులాల్ సర్కార్ ఈ ఘటనను ఖండించారు. ఇది బెంగాలీ సంస్కృతికి విరుద్ధమన్నారు. ఓట్లు అడుక్కునే సమయంలోనే ఇలా చేస్తే వారు గెలిచిన తర్వాత ఎలా ఉంటారో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశంపై ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

ఖగేన్ ముర్ము ఈ ఘటనపై స్పందిస్తూ... బిడ్డని ముద్దు పెట్టుకోవడంలో తప్పు ఏముంటుందని ప్రశ్నించారు. తనపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చెడుగా ఆలోచించే వారికి అలాంటి విలువలే ఉంటాయన్నారు. ముద్దు ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై తాను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

బీజేపీ ఎంపీ ముద్దు పెట్టుకున్న మహిళ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. ప్రతి విషయంలో అశ్లీలత చూడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూతురులా భావించి తనను ముద్దు పెట్టుకున్నారని పేర్కొంది. ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో నెగిటివ్‌గా ప్రచారం చేయడంతో వారి మనస్తత్వం తెలిసిపోతోందన్నారు. ఎంపీ తనను ప్రేమగా ముద్దు పెట్టుకున్న సమయంలో తన తండ్రి, తల్లి అక్కడే ఉన్నారని తెలిపారు.
Go Back to Shorts
BJP
Trinamool Congress
West Bengal
Lok Sabha Polls

More Telugu News