Prabhas: 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై బాలయ్య చేయి చూసిన ప్రభాస్ .. ఏం చెప్పాడంటే..!

  • 'అన్ స్థాపబుల్ 2' వేదికపై ప్రభాస్ 
  • తనని కూడా డాళింగ్ అని పిలవాల్సిందేనని కోరిన బాలయ్య 
  • అడవులంటే ఇష్టమని చెప్పిన ప్రభాస్ 
  • ఇటీవలే ఇల్లు కొన్నానని వెల్లడి  
Unstoppable 2 Prabhas Episode

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై పాప్యులర్ టాక్ షోగా 'అన్ స్టాపబుల్ 2'  కొనసాగుతోంది. తాజాగా ఈ టాక్ షోలో ప్రభాస్ - గోపీచంద్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. ప్యాంటు షర్టు వేసుకున్న పరశురాముడిలా ఉన్నావు' అంటూ ఆయనను బాలకృష్ణ వేదికపైకి ఆహ్వానించారు. ఈ కటౌట్ కి ఫ్యాన్స్ కాకుండా ఎలా ఉంటారు? అంటూ కితాబునిచ్చారు. తనని కూడా 'డాళింగ్' అంటూ పిలవాల్సిందేనని బాలకృష్ణ అడిగితే, 'డాళింగ్ సార్' అని పిలుస్తానంటూ ప్రభాస్ నవ్వులు పూయించారు. 

అసలు నీ సైజుకి రెడీమేడ్ బట్టలు దొరుకుతాయా? డిజైనర్ తో సెపరేటుగా కుట్టించడమేనా? అని ప్రభాస్ ను అడిగితే, 'బట్టలు నా ఫ్రెండ్ కుట్టేస్తాడు సార్ .. 'షూ' తోనే పెద్దసమస్య .. నా 'షూ' సైజ్ 12.5 అంటూ నవ్వేశాడు. 'ప్రభాస్ నువ్వు 'రాధే శ్యామ్'లో హస్తసాముద్రికుడిగా చేశావు .. నా చేయి చూసి నెక్స్ట్ పదేళ్లు ఎలా ఉంటాయో చెప్పు" అంటూ అడిగారు. ప్రభాస్ ఆయన చేయి చూసి ' సార్ .. అన్ స్టాపబుల్' అంటూ అరిచాడు.

"ఎవరైనా సరే గార్డెన్ పెంచుకుంటారు .. నువ్వేంటయ్యా  అడవిని దత్తత తీసుకున్నావ్?' అని బాల్లయ్య అడిగితే, "నాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం సార్ .. అలాగే జంతువులన్నా ఇష్టం. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా ప్రపంచంలోని అడవులన్నిటిలో తిరగాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ తో కలిసి వెళుతూ ఉంటాను" అన్నాడు. 'ఫ్రెండ్స్ అందరితో కలిసి ప్రైవేట్ జెట్స్ లో తిరుగుతుంటావు కదా ..  ఒకటి కొనుక్కోవచ్చు గదా? అని బాలకృష్ణ అడిగితే, "ఇన్నేళ్ల తరువాత ఒక ఇల్లు కొన్నాను సార్ .. ప్రైవేట్ జెట్ కి ఇంకా చాలా టైమ్ పడుతుందేమో" అంటూ నవ్వేశాడు.

More Telugu News