రేప్ కేసులో ఇరుక్కున్న క్రికెటర్... ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్న నేపాల్ పోలీసులు

Nepal police arrests Sandeep Lamichhane
  • గతంలో ఐపీఎల్ లోనూ ఆడిన సందీప్ లామిచానే
  • ప్రస్తుతం విదేశీ లీగ్ లతో బిజీ
  • 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు
  • ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో లామిచానే
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్
గతంలో ఐపీఎల్ లోనూ ఆడిన నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లామిచానే రేప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల మైనర్ బాలికపై సందీప్ లామిచానే అత్యాచారానికి పాల్పడినట్టు తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో సందీప్ లామిచానే ఇన్నాళ్లు విదేశాల్లో తలదాచుకున్నాడు. 

ఇటీవలే అతడిపై ఇంటర్ పోల్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దాంతో అజ్ఞాతాన్ని వీడిన సందీప్ లామిచానే నేడు స్వదేశానికి తిరిగొచ్చాడు. అతడు ఖాట్మండు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే, నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల క్రికెటర్ సందీప్ లామిచానేను కస్టడీలోకి తీసుకున్నట్టు ఖాట్మండు జిల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి దినేశ్ రాజ్ మైనాలి వెల్లడించారు.

అంతకుముందు, సందీప్ లామిచానే సోషల్ మీడియాలో స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విచారణలో సంపూర్ణంగా సహకరిస్తానని వెల్లడించాడు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తానని తెలిపాడు. 

కాగా, అత్యాచార ఆరోపణలు రావడంతో సందీప్ లామిచానేను నేపాల్ జాతీయ జట్టు కెప్టెన్ గా తొలగించారు. నేపాల్ క్రికెట్ జట్టు పసికూన అయినప్పటికీ, సందీప్ లామిచానే తన లెగ్ స్పిన్ నైపుణ్యంతో అనేక టీ20 లీగ్ లను ఆకర్షించాడు. కొన్ని సీజన్ల పాటు ఐపీఎల్ లోనూ ఆడిన లామిచానే... బిగ్ బాష్, సీపీఎల్, పాకిస్థాన్ టీ20 క్రికెట్ లీగ్ లతో బిజీ అయ్యాడు.
Go Back to Shorts
Sandeep Lamichhane
Arrest
Khatmandu
Cricket
Nepal

More Telugu News