టీమిండియాను ఓడించడానికి షహీన్ అవసరం లేదు... వీళ్లు చాలు: పాకిస్థాన్ హెచ్ కోచ్ సక్లైన్ ముస్తాక్
- యూఏఈలో రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం
- గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమైన షహీన్ షా అఫ్రిదీ
- పాక్ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్ మెన్ కు ఛాలెంజేనన్న సక్లైన్ ముస్తాక్
ఎలాంటి కఠినమైన ఛాలెంజ్ లనైనా ఎదుర్కొనేలా ఎన్నో రోజుల నుంచి తాము జట్టును సిద్ధం చేసుకున్నామని సక్లైన్ చెప్పారు. అవసరాలకు తగ్గట్టుగా వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు తమకు ఉన్నారని తెలిపారు. తమ బౌలింగ్ యూనిట్ పై తనకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ కే కాకుండా జట్టు మొత్తానికి నమ్మకం ఉందని చెప్పారు.
షహీన్ ఉంటే తమ బౌలింగ్ యూనిట్ అత్యంత పటిష్ఠంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే, అతను లేకపోయినా భారత బ్యాట్స్ మెన్లను వణికించగల బౌలర్లు పాక్ జట్టులో ఉన్నారని అన్నారు. మహ్మద్ హస్నైన్, నజీమ్ షా, హరీస్ రౌఫ్ లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం ఈ ముగ్గురు బౌలర్లకు ఉందని అన్నారు. పాక్ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్ మెన్ కు ఛాలెంజేనని చెప్పారు. మరోవైపు, టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆదివారం (28వ తేదీ) పాకిస్థాన్ తో ఆడబోతోంది.