73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
- ఇంగ్లండ్ రాయల్ వన్డే కప్ లో మెరుపు సెంచరీ
- ఒకే ఓవర్లో 22 పరుగులు బాదిన చటేశ్వర్
- అయినా తన జట్టు ససెక్స్ ను గెలిపించలేకపోయిన పుజారా
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో గ్రూప్-ఏలో భాగంగా వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా నుంచి ఈ మెరుపు సెంచరీ వచ్చింది. మొత్తంగా అతను 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. కానీ, తాను నాయకత్వం వహిస్తున్న ససెక్స్ జట్టుకు విజయం అందించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81) సత్తా చాటడంతో సులభంగా గెలిచేలా కనిపించింది. పైగా 47వ ఓవర్లో పుజారా 22 పరుగులు రాబట్టాడు. లియామ్ నార్వెల్ వేసిన ఈ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4 బాదాడు. కానీ, తర్వాతి ఓవర్లో అతను ఔటవడంతో ససెక్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.