ఎనిమిదో సారి బీహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్...రెండో సారి డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్
- నిన్ననే ఎన్డీఏ నుంచి తొలగి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్
- తాజాగా బీహార్‌కు ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ చీఫ్
- మరోమారు నితీశ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరిన తేజస్వీ
మొన్నటిదాకా బీహార్ సీఎంగా కొనసాగిన నితీశ్.. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి, మహాఘట్ బంధన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం గవర్నర్ ఫాగు చౌహాన్‌కు తన రాజీనామాను సమర్పించిన నితీశ్.. తనకు మద్దతుగా నిలిచిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 7 పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే... తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల సభ్యులకు కూడా నితీశ్ తన కేబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.