Advertisement

అధికారుల తొలగింపు సరిపోదు.. మంత్రిదే బాధ్యత: కాక్‌రోచ్ జనతా పార్టీ

Removing officials is not enough Minister is responsible says Cockroach Janata Party
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
  • మంత్రి రాజీనామా చేయకుంటే చర్చలు జరపబోమని స్పష్టం చేసిన సీజేపీ
  • ఎన్‌టీఏలో 47 మంది అధికారుల తొలగింపు సరిపోదని వ్యాఖ్య
  • పేపర్ లీక్‌లపై కఠిన చట్టాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడి
  • మంత్రి రాజీనామా అంశంలో స్పష్టత రాకపోతే తదుపరి వ్యూహం రచిస్తామని హెచ్చరిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్‌ల వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి స్పష్టం చేసింది. మంత్రి రాజీనామాకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఇకపై చర్చలు జరపడంలో అర్థం లేదని పేర్కొంది. ప్రభుత్వంతో మూడో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో సీజేపీ ఈ మేరకు తన వైఖరిని తెలిపింది.

ఇవాళ‌ ఉదయం సీజేపీ ప్రతినిధి అశుతోశ్‌ రంకా మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని అన్నారు. "నిన్న జరిగిన సమావేశంలో నష్టపరిహారం, చట్టపరమైన కేసుల విషయంలో మాకు సానుకూల స్పందన లభించింది. సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈరోజు దానిపై లిఖితపూర్వక హామీ వస్తుందని ఆశిస్తున్నాం. కానీ, మా ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం ఎటువంటి స్పష్టమైన నిర్ణయం లేదు" అని ఆయన తెలిపారు.

"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని మీడియా వర్గాల ద్వారా మాకు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఇక ఈ సమావేశాలు ఎందుకు? ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే మా తదుపరి వ్యూహంతో ముందుకు వెళ‌తాం" అని రంకా హెచ్చరించారు.

పేపర్ లీక్‌ల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి చెందిన 47 మంది అధికారులను తొలగించడం వంటి ప్రభుత్వ చర్యలపై కూడా సీజేపీ స్పందించింది. ఈ చర్యలు మాత్రమే సరిపోవని, ఈ వ్యవహారంలో అసలైన జవాబుదారీతనం కేంద్ర విద్యాశాఖ మంత్రిదేనని తెలిపింది. 

"తొలగించిన 47 మంది అధికారులు ఎవరు, వారిని ఏ ఉద్దేశంతో తొలగించారో పరిశీలించాల్సి ఉంది. కానీ, దేశంలో జరిగిన పేపర్ లీక్‌లకు, నీట్ పరీక్ష తర్వాత జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి" అని అశుతోశ్‌ రంకా డిమాండ్ చేశారు.

మరోవైపు పోటీ పరీక్షలలో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన 'ప్రజా పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం-2024'కు కేంద్ర కేబినెట్ నిన్న‌ సవరణలకు ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త సవరణల ప్రకారం సంఘటిత పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. ఇప్పటికే ఉన్న చట్టంలో 3 నుంచి 5 ఏళ్ల శిక్ష ఉండగా.. దాన్ని మరింత కఠినతరం చేశారు. అయితే, ఈ చట్ట సవరణలను స్వాగతిస్తున్నప్పటికీ, మంత్రి రాజీనామా డిమాండ్‌కే కట్టుబడి ఉన్నామని సీజేపీ స్పష్టం చేసింది.
Advertisement
Dharmendra Pradhan
Cockroach Janata Party
Paper Leak Controversy
National Testing Agency
NEET Exam Issue
Education Minister Resignation

More Telugu News