Advertisement

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజే నిర్మల్ జిల్లా యువకుడి మృతి!

Nityananda Reddy dies in USA road accident on his birthday
  • నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన నిత్యానందరెడ్డి
  • గత శనివారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన వైనం
  • కోమాలో ఉన్న ఆయన చేత బర్త్ డే కేక్ కట్ చేయించిన స్నేహితులు
  • ఆ తర్వాత కాసేపటికే కన్నుమూసిన నిత్యానందరెడ్డి

ఉన్నత చదువులు పూర్తిచేసి, విదేశాల్లో స్థిరపడి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో విధి బలితీసుకుంది. అమెరికాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సరిగ్గా తన పుట్టినరోజు నాడే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.


బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం:

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్(డబ్ల్యూ) గ్రామానికి చెందిన రైతు దంపతులు గన్ను శ్రీనివాస్, విశ్వరూపల కుమారుడు నిత్యానందరెడ్డి. నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య (మాస్టర్స్) కోసం అమెరికా వెళ్లిన ఆయన, ప్రస్తుతం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గత శనివారం ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిన సమయంలో నిత్యానందరెడ్డి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.


వెంటనే సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి తీవ్రంగా విషమించి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. దీంతో వైద్యులు ఐదు రోజుల పాటు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్సలు అందించారు.


గురువారం నిత్యానందరెడ్డి 26వ పుట్టినరోజు కావడంతో, ఆసుపత్రిలోనే ఆయన స్నేహితులు అత్యంత భావోద్వేగపూరితంగా వేడుక నిర్వహించారు. నిత్యానందరెడ్డి తన పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా కొనుక్కున్న కొత్త దుస్తులను ఆయనకు తొడిగి, వెంటిలేటర్‌పై అచేతన స్థితిలోనే ఉన్న ఆయన చేతితో కేక్ కోయించారు. ఈ దృశ్యాలను అమెరికాలోని స్నేహితులు వీడియో కాల్ ద్వారా స్వగ్రామంలోని తల్లిదండ్రులకు చూపించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టినరోజు వేడుకలు పూర్తయిన కొన్ని గంటల్లోనే నిత్యానందరెడ్డి తుదిశ్వాస విడిచారు.


పుట్టినరోజు నాడే కుమారుడు అనంతలోకాలకు వెళ్లడంతో కన్నవారు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యానందరెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంబసీ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతో పాటు గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Advertisement
Nityananda Reddy
USA road accident
Nirmal youth death
Detroit Michigan accident
Telugu student death USA
Telangana youth USA accident

More Telugu News