Tollywood: నా భర్త ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇండస్ట్రీ వాళ్లే కరెంట్ షాక్ పెట్టి, పీక పిసికి చంపారు: సీనియర్ నటి కృష్ణవేణి

My Husband Brutally Killed By Industry People Says Senior Actress Krishnaveni
  • ఆనాటి ఓ హీరోయిన్ కూడా హత్యలో భాగమైంది
  • చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు
  • కొన్నేళ్లకే షుగర్ వచ్చి చనిపోయిందని వెల్లడి
  • పోలీసులకు తెలిసినా ఏం చేయలేకపోయారని ఆవేదన
43 ఏళ్ల కెరీర్.. హీరోయిన్ గా, సహాయ నటిగా, హాస్య నటిగా, అమ్మగా, బామ్మగా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి కృష్ణవేణి. అయితే, మొహానికి రంగులు వేసుకుని రంగుల ప్రపంచంలో అందరినీ ఆమె అలరించినా.. ఆమె జీవితం వెనుక ఎన్నెన్నో తెలియని విషాద ఘట్టాలున్నాయి. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు.

పదేళ్లకే తనకు బాల్యవివాహం జరిగిందని, 13 ఏళ్లకే సంతానం కలిగిందని చెప్పారు. ఆ తర్వాత భర్తతో పొసగక విడాకులు తీసుకున్నానని, చంకలో బిడ్డనెత్తుకుని ఇండస్ట్రీకి వచ్చానని వివరించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టైంలోనే వారాలబ్బాయి, శ్రీమతిగారు, ముగ్గురు మిత్రులు వంటి హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ రాజచంద్రతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే, అప్పటికే ఆయనకు పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారని తెలిపారు.

పెళ్లయిన నాలుగేళ్లకే ఆయన్ను ఇండస్ట్రీ వాళ్లే కరెంట్ తీగలతో షాకిచ్చి, పీక పిసికి అత్యంత దారుణంగా చంపేశారని కృష్ణవేణి అన్నారు. చేతిలో డబ్బులేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించడంతో.. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారని, ఆనాటి ఓ హీరోయిన్ ఆయన హత్యలో భాగమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు.

ఎవరు చంపారో పోలీసులకు తెలిసినా.. ఏం చేయలేమంటూ చేతులెత్తేశారని గుర్తు చేశారు. తమనూ చంపేస్తామని బెదిరించడంతో కొన్నాళ్ల పాటు పోలీసులు తమ ఇంటికి కాపలాగా ఉన్నారని చెప్పారు. తన భర్తను ఓ హీరోయిన్ హత్య చేయించిందని కృష్ణ వేణి చెప్పినా.. ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. కొన్నాళ్లకే ఆమె షుగర్, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోయిందని చెప్పారు.
Tollywood
Krishnaveni
Actress

More Telugu News