గల్లీ క్రికెట్ నుంచి గ్లోబల్ స్టార్‌గా.. బుమ్రా జ‌ర్నీపై 'ది బూమ్ ఎఫెక్ట్' బుక్

గల్లీ క్రికెట్ నుంచి గ్లోబల్ స్టార్‌గా.. బుమ్రా జ‌ర్నీపై 'ది బూమ్ ఎఫెక్ట్' బుక్

From Street Cricket to Global Star The Boom Effect Book on Bumrahs Journey
  • జస్ప్రీత్ బుమ్రా జీవిత ప్రయాణంపై 'ది బూమ్ ఎఫెక్ట్' బుక్
  • వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న పుస్త‌కం 
  • ఈ బుక్‌ను ప్రచురిస్తోన్న‌ పెంగ్విన్ రాండమ్ హౌస్ 
  • గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి బుమ్రా ఎలా ఎదిగాడో తెలిపే విశ్లేషణ
  • బుమ్రా బౌలింగ్ యాక్షన్, మానసిక దృఢత్వం, సవాళ్లపై లోతైన పరిశీలన
భారత క్రికెట్ జట్టులో తిరుగులేని ఫాస్ట్ బౌలర్‌గా, ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన జస్ప్రీత్ బుమ్రా జీవిత ప్రయాణం త్వరలో పుస్తక రూపంలో రానుంది. 'ది బూమ్ ఎఫెక్ట్' పేరుతో రానున్న ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. క్రీడా జర్నలిస్టులు ఆయుష్ పుత్రాన్, నికోలస్ బ్రూక్స్ కలిసి దీనిని రచించగా, ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తన 'ప్లే' విభాగం కింద దీనిని ప్రచురిస్తోంది. 

అహ్మదాబాద్ వీధుల్లో ఆడిన ఓ సాధారణ యువకుడు, ప్రపంచంలోనే అత్యంత భయానక పేసర్‌గా ఎలా ఎదిగాడన్న ఆసక్తికర ప్రస్థానాన్ని ఈ పుస్తకం ఆవిష్కరించనుంది.

బుమ్రా ప్రయాణం సంప్రదాయ పద్ధతిలో సాగలేదు. అతను ఏ పెద్ద అకాడమీ నుంచో లేదా అండర్-19 జట్టు నుంచో రాలేదు. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన దేహదారుఢ్యం, పొడవైన రనప్ వంటివి అతనిలో కనిపించలేదు. అహ్మదాబాద్‌లో పెరుగుతూ, ఎక్కువగా టెలివిజన్‌లో మ్యాచ్‌లు చూస్తూ, గల్లీ క్రికెట్ ఆడుతూనే తన నైపుణ్యాలకు పదునుపెట్టుకున్నాడు. చాలా ఆలస్యంగా ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, అనతికాలంలోనే ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అవకాశం దక్కించుకున్నాడు.

ఈ పుస్తకాన్ని కేవలం మ్యాచ్‌ల వారీగా కాకుండా, విశ్లేషణాత్మకంగా రూపొందించారు. దీనిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించారు. గుజరాత్‌లో గడిపిన తొలి రోజులు, అతని ఆటలోని శారీరక, మానసిక అంశాలు, ప్రపంచ శక్తిగా అతని ఆవిర్భావం వంటి విషయాలను ఇందులో పొందుపరిచారు. 

అతని బౌలింగ్ యాక్షన్‌ను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం? స్పీడ్-గన్ చూపించే దానికంటే వేగంగా బంతిని ఎలా విసురుతాడు? తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఎలా ఉంటాడు? వంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు అన్వేషిస్తుంది. కెరీర్‌లో ఎదుర్కొన్న గాయాలు, అతని బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన సందేహాలు, టెస్టు క్రికెట్‌లో రాణించగలడా అన్న అనుమానాలను ఎలా అధిగమించాడో కూడా వివరిస్తుంది.

ఒకప్పుడు అతని బలహీనతలుగా భావించిన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్, చిన్న రనప్, సంప్రదాయేతర మార్గమే అతని విజయానికి కేంద్ర బిందువులయ్యాయని రచయితలు వాదిస్తున్నారు. 

ఈ పుస్తకం ప్రతిభ, వ్యక్తిత్వం, పట్టుదల, నైపుణ్యం కలగలిసి ఒక ఛాంపియన్‌ను ఎలా తయారు చేస్తాయో తెలిపే ఒక పరిశోధనాత్మక గ్రంథంగా నిలుస్తుందని ప్రచురణకర్తలు తెలిపారు.
Advertisement
Jasprit Bumrah
The Boom Effect Book
Indian Fast Bowler
Ayush Puthran Nicholas Brookes
Penguin Random House India
Mumbai Indians IPL

More Telugu News