కోటి ఎకరాలు కాదు.. కేవలం 3.60 లక్షల ఎకరాలే నిషేధిత జాబితాలో ఉన్నాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోటి ఎకరాలు కాదు.. కేవలం 3.60 లక్షల ఎకరాలే నిషేధిత జాబితాలో ఉన్నాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas slams BRS for spreading lies on Section 22A prohibited lands
  • 22ఏ నిషేధిత భూముల జాబితాపై బీఆర్ఎస్ అసత్యాలు మాట్లాడుతోందన్న ఆది శ్రీనివాస్
  • బీఆర్ఎస్ పాలనలోని తప్పిదాలను సరిదిద్దుతుంటే ఓర్వలేకపోతున్నారని మండిపాటు
  • మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని విమర్శ

తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితాపై బీఆర్‌ఎస్ పార్టీ పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ ద్వారా కొందరు నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి పాలకులు చేసిన చారిత్రక తప్పిదాలను ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో సరిదిద్దుతుంటే ఓర్వలేక నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలో ఏకంగా కోటి ఎకరాల భూములను 22ఏ జాబితాలో చేర్చారంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు, తీవ్రమైన న్యాయపరమైన వివాదాలు ఉన్న కేవలం 3.60 లక్షల ఎకరాల భూములను మాత్రమే నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉంచినట్లు స్పష్టం చేశారు. అధికారుల తప్పిదం వల్ల ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే వాటిని ప్రభుత్వం వెంటనే సరిదిద్దుతోందని తెలిపారు.


అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు హాజరుకాకుండా ‘మాక్ అసెంబ్లీ’ల పేరుతో నాటకాలు ఆడటం బీఆర్‌ఎస్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సభాపతిని, దళిత వర్గాలను, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అవమానిస్తూ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లలో ధరణి అడ్డం పెట్టుకుని జరిగిన భూ దారుణాలను త్వరలోనే ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేస్తామని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.

Advertisement
Adi Srinivas
Section 22A prohibited lands
Dharani portal Telangana
Telangana land records
BRS party
Telangana government news

More Telugu News