రూ.11 ఉత్పత్తిపై రూ.325 వసూలు.. ఆసుపత్రి బిల్లులపై తుకారాం ముండే సంచలన విషయాలు

రూ.11 ఉత్పత్తిపై రూ.325 వసూలు.. ఆసుపత్రి బిల్లులపై తుకారాం ముండే సంచలన విషయాలు

Tukaram Mundhe Exposes Shocking Hospital Bills Charging 325 Rupees for 11 Rupee Product
  • ఆసుపత్రి ఉత్పత్తుల ధరల్లో భారీ వ్యత్యాసం గుర్తింపు
  • రూ.11.05 ఐవీ సెట్‌ ఎంఆర్‌పీ రూ.325గా గుర్తించినట్లు తుకారాం ముండే వెల్లడి
  • సిరంజీ కొనుగోలు ధర రూ.6.75 కాగా ఎంఆర్‌పీ రూ.57.20గా ఉన్నట్లు గుర్తింపు
  • కాథెటర్‌ కొనుగోలు ధర రూ.29.41 కాగా ఎంఆర్‌పీ రూ.310
  • వైద్య పరికరాలపై ధర నియంత్రణ తక్కువగా ఉందన్న ముండే
ఇటీవల తన దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్‌ తుకారాం ముండే.. ఆసుపత్రుల్లో రోగుల నుంచి వసూలు చేస్తున్న ధరలపై సంచలన విషయాలను బయటపెట్టారు. రూ.11కే కొనుగోలు చేసిన ఐవీ ఇన్ఫ్యూషన్‌ సెట్‌ను ఏకంగా రూ.325కు విక్రయిస్తున్నారని వెల్లడించారు. అంటే కొనుగోలు ధరతో పోలిస్తే దాదాపు 2,841 శాతం అధికంగా ఎంఆర్‌పీ పెడుతున్నారని తెలిపారు.

మహారాష్ట్రలో ఆసుపత్రుల్లో వినియోగించే పలు ఉత్పత్తులపై నిర్వహించిన సర్వే వివరాలను ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వాటి కొనుగోలు ధరకు, ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరకు (ఎంఆర్‌పీ) మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు.

సర్వే ప్రకారం.. రూ.11.05కు కొనుగోలు చేసిన ఐవీ ఇన్ఫ్యూషన్‌ సెట్‌పై రూ.325 ఎంఆర్‌పీ ఉంది. అంటే ఏకంగా 2,841 శాతం మార్జిన్‌ నమోదైంది. రూ.6.75కు కొనుగోలు చేసిన సిరంజీపై రూ.57.20 ఎంఆర్‌పీ ఉంది. రూ.29.41కు తెచ్చిన కాథెటర్‌కు రూ.310 ఎంఆర్‌పీ ముద్రించారు.

చికిత్స కోసం తప్పనిసరిగా ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో రోగులకు ధరలను పోల్చుకునే అవకాశం ఉండదని ముండే అన్నారు. ప్రత్యామ్నాయాలు వెతకడం లేదా ధరను ప్రశ్నించడం కూడా వారికి సాధ్యం కాదని పేర్కొన్నారు.

తయారీదారులు, పంపిణీదారుల స్థాయిలో ఎంఆర్‌పీ నిర్ణయమవుతుందని.. అది వాస్తవ కొనుగోలు ధరకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. దీంతో రోగులపై వివరాలు తెలియని అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.

షెడ్యూల్డ్‌ మందులకు డ్రగ్స్‌ ప్రైసెస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-2013 కింద ధరల పరిమితి ఉందని ముండే వివరించారు. అయితే చాలా వైద్య పరికరాలు, వినియోగ వస్తువులకు ఇలాంటి ధర నియంత్రణ లేదన్నారు. దీంతో వాటి ధరలపై పర్యవేక్షణ తక్కువగా ఉందని తెలిపారు.

కొనుగోలు ధరకు, ప్రకటించిన ఎంఆర్‌పీకి మధ్య అనుమతించదగిన వ్యత్యాసంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఫార్మాస్యూటికల్స్‌ శాఖ, నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ)కి సూచించినట్లు ముండే చెప్పారు.
Advertisement
Tukaram Mundhe
Maharashtra FDA
Hospital Medical Bills
Medical Equipment Pricing
NPPA India
IV Infusion Set Price

More Telugu News