జీతం తీసుకుంటూ పీజీ చదువులు.. ఎమ్మెల్యే మేనకోడలైన లేడీ డాక్టర్‌కు నోటీసులు
- కర్ణాటకలోని బాగల్‌కోట్ ‘నమ్మ క్లినిక్’లో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అంకిత
- బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత
- విధుల నుంచి తప్పించిన జిల్లా వైద్యశాఖ అధికారి
కర్ణాటకలోని బాగల్‌కోట్ ‘నమ్మ క్లినిక్’లో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అంకిత యారగళ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ అనుబంధ క్లినిక్ నుంచి నెలకు రూ. 70,000 కంటే ఎక్కువ జీతం పొందుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చదువుతున్నారనే తీవ్ర ఆరోపణలు ఆమెపై వచ్చాయి. ఈ క్రమంలో అధికారిక విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, అనుమతి లేని ద్వంద్వ బాధ్యతలపై విచారణ ప్రారంభమైంది.
బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలైన డాక్టర్ అంకిత... బాగల్‌కోట్ జిల్లా పంచాయతీ సీఈఓ గజానన్ బేలే నిర్వహించిన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమె గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన సీఈఓ, సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు జిల్లా పంచాయతీ కార్యాలయంలోని రూమ్ నంబర్ 11 లో జరగబోయే తదుపరి విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
విచారణ నోటీసులోని ప్రధానాంశాలు:
సుదీర్ఘ గైర్హాజరు: వాంబే కాలనీలోని నమ్మ క్లినిక్‌కు మార్చి 3వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు వైద్యాధికారి లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన: ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో పనిచేసే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల నిబంధనలను, నేషనల్ మెడికల్ కమిషన్ వృత్తిపరమైన నీతి నియమావళిని ఆమె ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.
కఠిన చర్యల హెచ్చరిక: వృత్తిపరమైన దుష్ప్రవర్తన కింద క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడమే కాకుండా, ఈ వ్యవహారాన్ని కర్ణాటక మెడికల్ కౌన్సిల్, ఎన్‌ఎంసీకి నివేదిస్తామని హెచ్చరించారు.
జీతం రికవరీ: విధులకు హాజరుకాకుండా పొందిన మొత్తం జీతం/గౌరవ వేతనాన్ని చట్టపరంగా రికవరీ చేస్తామని తెలిపారు.
ఎక్స్-పార్టీ నిర్ణయం: సెప్టెంబర్ 18న జరిగే విచారణకు హాజరుకాకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజ్‌కుమార్ యారగళ్ ఆమెను విధుల నుంచి తొలగించారు.