హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇదే చివరి అవకాశమన్న సీజేఐ!
- ఓవైపు సుందరీకరణ చేస్తూనే కలుషితం చేస్తారా?
- కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం
- నిమజ్జనం అయిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఆదేశం
ఆ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఆ పిటిషన్ ను ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించింది. హైదరాబాద్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం కొత్త సమస్య కాదని, ఎన్నో ఏళ్లుగా ఉన్నదేనని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నిమజ్జనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ సుందరీకరణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూనే మళ్లీ ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులను ఇస్తున్నారని ఆక్షేపించారు. తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, వచ్చే ఏడాది నుంచి పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని తేల్చి చెప్పారు.
నిమజ్జనానికి ఆధునిక క్రేన్లను వినియోగించాలని, నిమజ్జనం అయిపోయిన వెంటనే ఆ వ్యర్థాలను తొలగించాలని జస్టిస్ రమణ సూచించారు. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ ను మంచినీటి కోసం వినియోగించేవారని, ఇప్పుడు ఇలా కలుషితమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.