Andhra Pradesh: పరీక్షల నిర్వహణ వల్ల ఏ ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Supreme Court fires on AP govt
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు, హెచ్చరికలు జారీ చేసింది. పక్కా సమాచారం ఇవ్వాలని తాము ఆదేశించినప్పటికీ... అఫిడవిట్ లో ఆ సమాచారం కనిపించలేదని అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. పరీక్షల నిర్వహణ వల్ల ఏ ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కరోనా సమయంలో ఒక్కో గదిలో 15 నుంచి 20 మందిని కూర్చో బెట్టడం ఎలా సాధ్యమవుతుందని సుప్రీం ప్రశ్నించింది. సెకండ్ వేవ్ లో దారుణమైన పరిస్థితులను మనం చూశామని చెప్పింది. ప్రభుత్వం చెపుతున్నదాన్ని బట్టి పరీక్షలకు 28 వేల గదులు అవసరమవుతాయని... అన్ని వేల గదులను అందుబాటులోకి ఎలా తీసుకురాగలరని ప్రశ్నించింది. పరీక్షల తర్వాత జరిగే మూల్యాంకనం ప్రక్రియ కూడా చాలా పెద్దగా ఉంటుందని... వీటన్నిటికి సంబంధించి అఫిడవిట్ లో ఎలాంటి వివరాలు లేవని అసహనం వ్యక్తం చేసింది.

కరోనాకు సంబంధించిన వివిధ వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా... ఏపీ ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. అవసరమైతే యూజీసీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలను తీసుకోవాలని సూచించింది. పరీక్షలు కొనసాగుతున్న సమయంలో థర్డ్ వేవ్ వస్తే... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కొంత సమయం ఇస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కోర్టును కోరారు. అయితే ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలు విద్యార్థులపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
10th Class
Inter
Exams
Supreme Court

More Telugu News