MAA: కన్నడ దిగ్గజం విష్ణువర్ధన్ పై విజయ రంగరాజు సంచలన విమర్శలు... క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు నరేశ్!

  • ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ రంగరాజు
  • విష్ణువర్ధన్ పై అనుచిత వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహం
  • కన్నడ అభిమానులకు 'మా' తరఫున నరేశ్ క్షమాపణలు
MAA President Naresh sorry to Kannada Movie Fans Over Actor Vijaya Rajgaraju Comments

కన్నడ స్టార్ విష్ణువర్ధన్ పై నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, కన్నడ ప్రజలకు తెలుగు సినీ పరిశ్రమ తరఫున క్షమాపణలు చెబుతున్నానని మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ తెలిపారు. విజయ రంగరాజు వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన అసభ్య పదజాలం వాడటం సరికాదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నరేశ్ ఓ ట్వీట్ పెట్టారు.

"తెలుగు నటుడు విజయ రంగరాజు కన్నడ హీరో, స్వర్గీయ విష్ణువర్ధన్ ను ఏకవచనంతో సంబోధిస్తూ, అసభ్య పదజాలాన్ని వాడారు. కన్నడ సోదర సోదరీమణులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మనమంతా ఐకమత్యంగా ఉండి, పరస్పరం గౌరవించుకోవాలి" అని అన్నారు. విష్ణువర్ధన్ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని, వ్యక్తిగత అభిప్రాయాలనే విజయ రంగరాజు చెప్పినా, అలా మాట్లాడటం చాలా తప్పని నరేశ్ అభిప్రాయపడ్డరు.

తాను చిన్నతనం నుంచి విష్ణువర్ధన్ చిత్రాలను చూస్తూ పెరిగానని, ఆయన తనకు అభిమాన నటుడు కూడానని అన్నారు. మరోసారి ఇటువంటి తప్పు జరుగకుండా చూసేందుకు విజయ రంగరాజుతో స్వయంగా చర్చిస్తానని అన్నారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ రంగరాజు, విష్ణువర్ధన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను సుమలత, యశ్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ తదితరులు ఖండించారు. విజయ రంగరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తనను క్షమించాలని ఓ వీడియోను విడుదల చేశారు.

More Telugu News