April 9: మెగాస్టార్ 'ఆచార్య' విడుదల తేదీని లాక్ చేసిన నిర్మాతలు!

  • వచ్చే సంవత్సరం ఏప్రిల్ 9న విడుదల!
  • వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్న నిర్మాతలు
  • ఇంకా అధికారికంగా వెలువడని ప్రకటన
Acharya Release Date Fix

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' రిలీజ్ తేదీని నిర్మాతలు ఫిక్స్ చేసేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, లాక్ డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏప్రిల్ 9కి ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. ఆ రోజు విడుదలైన దాదాపు అన్ని చిత్రాలూ సూపర్ హిట్ గా నిలిచాయన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు 'ఆచార్య'ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై, నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల తేదీ విషయంలో ఏ మేరకు వాస్తవం ఉందన్న సంగతి తెలియాలంటే నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ స్పందించాల్సిందే.

More Telugu News