Chiranjeevi: ఆ హనుమంతుడి బొమ్మ... అచ్చం నాలాగే...!: చిరంజీవి చెప్పిన ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్

  • నేడు హనుమజ్జయంతి
  • ఆంజనేయస్వామితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి
  • ట్విట్టర్ ఖాతాలో వరుసగా పోస్టులు
Chiranjeevi Shares Intresting Flashback

నేడు హనుమజ్జయంతి కాగా, ఆంజనేయస్వామితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లను ఆయన పెట్టారు.

"ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది... చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది.. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, 'ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి' అన్నారు. అప్పటి నా ఫొటో" అంటూ చిన్నప్పటి తన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

ఆపై "కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద రీప్రొడ్యూస్ చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?" అని మరో ట్వీట్ పెట్టారు.

"బాపు గారు చెప్పిన మాట 'ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు' అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది" అని అన్నారు.

"డ్యాన్స్ లో గ్రేస్ ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీలోని  కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్ డే బన్నీ. నువ్వు బాగుండాలబ్బా" అని నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News