Crime News: అక్కా అంటూ లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి... అత్యాచార యత్నం.. తప్పించుకున్న యువతి

షార్ట్స్‌లో చూడండి
అక్కా అని ఆప్యాయంగా సంబోధించి, లిఫ్ట్‌ ఇస్తానంటే అతని మనసులోని దుష్ట బుద్ధిని ఆమె గమనించలేకపోయింది. వాహనాన్ని ఎక్కించుకున్న అతను దారి మళ్లించి పొలాల్లోకి తీసుకువెళ్తుంటే అత్యాచారం ఆలోచనలో ఉన్నాడని అనుమానించింది. అతని దుర్బుద్ధిని గుర్తించిన వెంటనే ఆ యువతి వాహనంపై నుంచి దూకి తప్పించుకుంది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలుకాగా, నిందితుడిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

పోలీసుల కథనం మేరకు, క్రష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన బాధిత యువతి కంకిపాడులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి డ్యూటీ నిమిత్తం కంకిపాడు వెళ్లేందుకు గ్రామంలో ఆటో కోసం వేచి ఉండగా అదే గ్రామానికి చెందిన చోరగుడి రవీంద్ర ఆమె వద్దకు వచ్చాడు. 'అక్కా, నేను కూడా కంకిపాడు వెళ్తున్నా, బండి ఎక్కితే డ్రాప్‌ చేస్తా'నని చెప్పాడు. ముఖ పరిచయం ఉన్న వాడే కదా అని నమ్మి ఆ యువతి అతని బండి ఎక్కింది.

కంకిపాడు లాకుల వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాహనం వేగాన్ని పెంచిన అతను గోసాల వైకుంఠపురం వైపు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో అనుమానించిన ఆ యువతి వాహనాన్ని ఆపాలని కోరింది. అయినా పట్టించుకోకుండా అతను మరింత వేగంగా పొలాల వైపు వెళ్తుండడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ ‘బండి ఆపకుంటే దూకేస్తాను’ అంటూ బెదిరించింది. అయినా అతను ఆపకపోవడంతో గట్టిగా కేకలువేస్తూ వాహనంపై నుంచి దూకేసింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల పనుల్లో ఉన్న వారు వచ్చి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని రక్షించారు.

రవీంద్రను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు రవీంద్ర ఓ ప్రధాన పార్టీలో ముఖ్య కార్యకర్త అని గోసాల, గొడవర్రు  గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
Go Back to Shorts
Crime News
Krishna District
kankipadu
rape attempt

More Telugu News