ఆనాడు నా డ్యూటీ నేను చేశానంతే... కేసు నిలబడుతుందా? అంటే ఏమీ చెప్పలేను!: జగన్ కేసులపై లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
- జగన్ అక్రమాస్తుల కేసును పర్యవేక్షించిన లక్ష్మీనారాయణ
- హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాఫ్తు చేశామంతే
- ఇప్పుడున్న అధికారులూ సమర్థులే
- ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేనన్న సీబీఐ మాజీ జేడీ
కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని లక్ష్మీనారాయణ వెల్లడించారు. తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని, దీంతో జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందని పలువురు భావిస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు. తాను పనిచేసినంత కాలం ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.