దెయ్యం పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. పీక కోసుకొని ఆత్మహత్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దెయ్యం పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. పీక కోసుకొని ఆత్మహత్య!

  • మూఢ న‌మ్మ‌కాల బారిన ప‌డ్డ యువకుడు
  • తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులకు చెప్పిన వైనం
  • శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలో మసీదు ఎదుట ఘటన
కంప్యూట‌ర్ యుగంగా పేర్కొంటోన్న ఈ కాలంలోనూ మూఢ న‌మ్మ‌కాల బారిన ప‌డుతూ కొంద‌రు ప్రాణాలు తీసుకుంటున్నారు. యువ‌త కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోలేక‌పోతున్నారు. దేవుడు పిలుస్తున్నాడంటూ గ‌తంలో ముగ్గురు మ‌హిళ‌లు ఒకేసారి ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ యువ‌కుడు తన ఆరోగ్యం బాగోలేదని, తనకు దెయ్యం పట్టినట్టు ఉందని మ‌సీదు ముందు పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలో చోటు చేసుకుంది.

ఆ యువకుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడన్న విష‌యాన్ని గుర్తించిన స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ యువ‌కుడిని లావేరు మండలం బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్ గా పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీలో ప‌ని చేసుకుని జీవ‌నం కొన‌సాగిస్తోన్న సురేష్.. త‌మ కార్యాల‌యానికి ద‌గ్గ‌ర‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తన చిన్నాన్నకు ఫోన్‌ చేసి, తనకు ఆరోగ్యం బాగోలేదని, దెయ్యం పట్టినట్టు అవుతోందని చెప్పాడు.

దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు. ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్ధరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని చ‌నిపోవ‌డంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 
devil
youngster
suicide
Srikakulam District

More Telugu News