టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్‌ బౌలర్లపై పరుగుల సునామీ సృష్టించారు. మూడో టీ20లో అభిషేక్‌ శర్మ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత స్కోరు బోర్డు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఆరంభంలో సూర్యవంశీ మెరుపులు కూడా తోడవడంతో కేవలం ఐదు ఓవర్లలోనే భారత్‌ 100 పరుగుల మైలురాయిని అందుకుంది. ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరుగా నిలిచింది. 

గతంలో 2021లో సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 5.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమోదైన ఆ రికార్డును ఇప్పుడు భారత్‌ అధిగమించింది.

ఆరంభం నుంచే భారత బ్యాటర్లు కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్‌ శర్మ 35 బంతుల్లో బౌండరీలు, సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి  విరుచుకుపడ్డాడు. ఇక ఆరంభంలో సూర్యవంశీ తనదైన దూకుడుతో స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. బంతి ఎక్కడ పడినా బౌండరీ దాటించడమే లక్ష్యంగా అభిషేక్‌ ఆడటంతో న్యూజిలాండ్‌ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది.

టీమిండియా 2.2 ఓవర్లలో 50 పూర్తి చేయడం, ఐదు ఓవర్లు పూర్తయ్యేలోపే భారత్‌ స్కోరు 100 దాటడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది కేవలం పవర్‌ప్లేలో సాధించిన పరుగులు కాదు.. ఐదు ఓవర్లకే భారత్‌ సాధించిన స్కోరు కావడం విశేషం. ఆరో ఓవర్‌ ముగిసేసరికి స్కోరు 118కు చేరడంతో టీ20ల్లో కొత్త చరిత్ర నమోదైంది.

పవర్‌ప్లే తర్వాత కూడా భారత జోరు కొనసాగుతుండగా, వైభవ్‌ సూర్యవంశీ 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లతో న్యూజిలాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మరోవైపు అభిషేక్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. చివరకు 38 బంతుల్లో 113 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

భారత బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌ బౌలింగ్‌ వ్యూహాలు తలకిందులయ్యాయి. టీ20ల్లో సాధారణంగా తొలి ఆరు ఓవర్లలోనే భారీ స్కోరు చేయడం కష్టమైన విషయం. అలాంటిది ఐదు ఓవర్లలోనే 100 పరుగులు, పవర్‌ప్లే ముగిసేసరికి 118 పరుగులు చేయడం భారత బ్యాటింగ్‌ దూకుడుకు నిదర్శనం. కాగా, 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 2 వికెట్లకు 178 పరుగులు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 21 పరుగులు కావాలి. క్రీజులో సంజూ శాంసన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.