హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్‌గా పోలీసులు గుర్తించారు. పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతోనే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండా, ఎస్‌ఆర్ సద్గురు రెసిడెన్సీలో అర్చన నివాసం ఉంటున్నారు. ఆమె స్థానికంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అర్చనకు ఉత్తరాఖండ్‌కు చెందిన భండారీ విమల్‌తో గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది. అయితే, విమల్‌కు అప్పటికే వివాహం కాగా, భార్యతో విడాకుల ప్రక్రియ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని అర్చన, విమల్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో, విమల్ తన తల్లితో కలిసి చేర్యాలలో ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు అర్చన అతనికి వీడియో కాల్ చేసింది. తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నట్లు చూపిస్తూ, తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన విమల్ ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. వెంటనే హుటాహుటిన ఆమె ఫ్లాట్‌కు చేరుకున్నాడు. అయితే, లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు.

వెంటనే విమల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, అప్పటికే అర్చన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు నేతృత్వంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. విమల్‌ను విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.