ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుముట్టి తాకారు: నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన

Anupama Parameswaran expresses distress over being surrounded and touched at the airport
  • ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్న అనుపమ
  • లగేజీ కోసం చూస్తుండగా చుట్టుముట్టి, అనుమతి లేకుండా ఫొటోలు తీశారని వెల్లడి
  • కొందరు తనను తాకడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ఆవేదన
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తనకు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు తనను చుట్టుముట్టి, అనుమతి లేకుండా ఫొటోలు తీయడమే కాకుండా అసభ్యంగా తాకారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టిందని తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఓ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం ఒంటరిగా వేచి చూస్తున్న సమయంలో కొందరు తన వద్దకు వచ్చారని అనుపమ చెప్పారు. మొదట మాట్లాడేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత తన అనుమతి లేకుండానే ఫొటోలు తీయడం మొదలుపెట్టారని వివరించారు. క్షణాల్లో జనం తనను చుట్టుముట్టారని, ఫొటోలు తీస్తూ తనను తాకారని, ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదని ఆమె పేర్కొన్నారు.

అభిమానులతో ఫొటోలు దిగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుపమ స్పష్టం చేశారు. అయితే, కొందరు ప్రవర్తించే తీరు, హద్దులు మీరడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇలాంటి సమయాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎక్కడ తాకుతారో తెలియక భయమేస్తుందని ఆమె అన్నారు. నటీనటుల వృత్తి జీవితంలో అభిమానులతో ఫొటోలు దిగడం సాధారణమే అయినా, కచ్చితంగా కొన్ని హద్దులు పాటించాలని సూచించారు. సమాజంలో సాధారణ మహిళలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలని అనుపమ పేర్కొన్నారు.
Advertisement
Anupama Parameswaran
Airport Incident
Tollywood Actress
Fan Misbehavior
Anupama Parameswaran Interview
Women Safety

More Telugu News