"నాతో మాట్లాడేంత ధైర్యం నీకెలా వచ్చింది?" మహిళా అధికారిపై ఐఏఎస్ రంకెలు.. వీడియో వైరల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"నాతో మాట్లాడేంత ధైర్యం నీకెలా వచ్చింది?" మహిళా అధికారిపై ఐఏఎస్ రంకెలు.. వీడియో వైరల్!

How dare you speak to me IAS officer yells at female official video viral
  • సమీక్షా సమావేశంలో మహిళా ఉన్నతాధికారిపై ఐఏఎస్ అధికారి ఆగ్రహం
  • "షటప్" అంటూ నోరు మూయించి, సస్పెన్షన్ ఆదేశాలు జారీ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. వెల్లువెత్తిన విమర్శలు
  • స్థానిక, స్థానికేతర అధికారుల మధ్య వివాదంగా రాజకీయ పార్టీల ఆరోపణ
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిపై గతంలోనూ సీబీఐ కేసులు
జమ్మూకశ్మీర్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. వర్చువల్ సమీక్షా సమావేశంలో ఓ మహిళా ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెను అవమానకరమైన పదజాలంతో దూషించి, సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, కార్మిక మరియు ఉపాధి శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్ అక్టోబర్ 14న 'మిషన్ యువ' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బనీశ్ వానీ వర్చువల్‌గా పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) పాత్రపై చర్చ జరుగుతున్నప్పుడు వివాదం మొదలైంది. NRLM కేవలం సహాయక సాధనం మాత్రమేనని, దానికి సొంత అధికారాలు ఉండవని రంజన్ అన్నారు. లక్ష్యాలు పూర్తయ్యాయని, NRLM సహకారం అవసరమని బనీశ్ వానీ వివరించడానికి ప్రయత్నించగా, రంజన్ ఒక్కసారిగా ఆగ్రహంతో "షటప్, మాట్లాడొద్దు" అంటూ ఆమెపై కేకలు వేశారు.

అయితే, బనీశ్ వెనక్కి తగ్గకుండా తన వాదన వినిపించే ప్రయత్నం చేయడంతో రంజన్ మరింత రెచ్చిపోయారు. "నాతో మాట్లాడేంత ధైర్యం నీకెలా వచ్చింది?" ప్రశ్నిస్తూ, ఆమెను ఉద్దేశించి ఓ అవమానకరమైన పదం వాడారు. వెంటనే ఆమె సస్పెన్షన్ ఆర్డర్ సిద్ధం చేయాలని కిందిస్థాయి అధికారిని ఆదేశించారు. అంతేకాదు, సదరు మహిళా ఉన్నతాధికారిని ఉద్దేశించి"గెటవుట్" అంటూ ఆయన గట్టిగా అరిచారు. దీనికి బనీశ్ అంతే ధీటుగా బదులిచ్చారు. "మీరు నన్ను సస్పెండ్ చేసుకోండి" అని స్పష్టం చేస్తూ, "టు హెల్ విత్ యూ" అంటూ సమావేశం నుంచి నిష్క్రమించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) నేతలు రంజన్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానిక, స్థానికేతర అధికారుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల్లో ఇది భాగమని వారు ఆరోపించారు. ఈ ఘటనపై బనీశ్ వానీ స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. మరోవైపు, వివరణ కోరేందుకు ప్రయత్నించగా రంజన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

కాగా, 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రంజన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయుధ లైసెన్సుల కుంభకోణంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో 2020లో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసింది. తాజా ఘటనతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
Advertisement
Kumar Rajeev Ranjan
Banish Wani
IAS officer misbehavior
Jammu and Kashmir viral video
Mission Youth meeting
IAS officer controversy

More Telugu News