మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే లక్షల విలువైన విదేశీ కరెన్సీ.. చివ‌రికి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే లక్షల విలువైన విదేశీ కరెన్సీ.. చివ‌రికి!

Bag found during morning walk contains foreign currency worth lakhs finally returned to owner
  • అజ్మేర్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వ్యక్తికి బ్యాగు లభ్యం
  • బ్యాగులో రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, పాస్‌పోర్ట్
  • పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌బీఐ మేనేజర్‌దిగా గుర్తింపు
  • నిజాయతీగా బ్యాగును పోలీసులకు అప్పగించిన రాజేశ్‌ కుమార్
  • యజమానికి బ్యాగును సురక్షితంగా అందజేసిన పోలీసులు
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఓ అరుదైన నిజాయతీ ఘటన వెలుగులోకి వచ్చింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి దారిలో ఓ బ్యాగు దొరకగా, అందులో ఏకంగా రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, కీలక పత్రాలు ఉన్నాయి. ఏమాత్రం ఆశపడకుండా ఆ వ్యక్తి దానిని పోలీసులకు అప్పగించడంతో వారు అసలు యజమానిని గుర్తించి సురక్షితంగా అందజేశారు. ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. అజ్మేర్‌లోని భోపోన్ కా బాడా ప్రాంతానికి చెందిన రాజేశ్‌ కుమార్ రోజూలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. సోఫియా కాలేజీ సమీపంలో రోడ్డుపై పడి ఉన్న ఓ బ్యాగును ఆయన గమనించారు. దానిని తెరిచి చూడకుండా నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగును పరిశీలించగా, అందులో పాస్‌పోర్ట్, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి.

బ్యాగులోని పత్రాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అది పశ్చిమ బెంగాల్‌కు చెందిన సద్దాం ఆలం అనే వ్యక్తిదని తేలింది. ఆయన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్‌బీఐ)లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రఖ్యాత అజ్మేర్ దర్గాను దర్శించుకోవడానికి ఆయన నగరానికి వచ్చారు. దర్గా దర్శనం అనంతరం ఓ టెంపోలో ప్రయాణిస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన బ్యాగు కింద పడిపోయింది. ఈ విషయం తెలియని సద్దాం ఆలం, తన బ్యాగు ఎక్కడ పోయిందోనని ఆందోళన చెందుతుండగా పోలీసులు ఆయనను సంప్రదించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్యాగులో 500 దినార్ల నోట్లు, 200 దినార్ల నోటు, 100 దినార్ల నోట్లు, 10 దినార్ల నోట్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ భారత కరెన్సీలో సుమారు రూ.9.48 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

ఈ నగదుతో పాటు ఆయన పాస్‌పోర్ట్, ఇతర కీలక పత్రాలను కూడా పోలీసులు సద్దాం ఆలంకు సురక్షితంగా అందజేశారు. పోయాయనుకున్న తన విలువైన వస్తువులు తిరిగి దొరకడంతో సద్దాం ఆలం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజస్థాన్ పోలీసులకు, అజ్మేర్ ప్రజలకు, ముఖ్యంగా బ్యాగును అప్పగించిన రాజేశ్‌ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లక్షల రూపాయల విలువైన వస్తువులు కళ్లముందు కనపడినా, ఏమాత్రం చలించకుండా నిజాయతీని చాటుకున్న రాజేశ్‌ కుమార్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు కొనియాడుతున్నారు.
Advertisement
Rajesh Kumar
Ajmer Rajasthan
Foreign currency bag
Saddam Alam
Honesty in Ajmer
Rajasthan Police

More Telugu News