కమిషన్ల కోసమే సింగరేణిని దోచుకుంటున్నారు: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమిషన్ల కోసమే సింగరేణిని దోచుకుంటున్నారు: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR slams Revanth government for looting Singareni for commissions
  • వాటాలు తేలకపోవడం వల్లే నైని టెండర్లు రద్దు చేశారని విమర్శ
  • సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగిందన్న కేటీఆర్
  • సింగరేణి అక్రమాలపై ఆధారాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశామని వెల్లడి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం సింగరేణి సంస్థను పంచుకొని దోచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు (కేటీఆర్) ఆరోపించారు. సింగరేణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం శ్రద్ధ లేదని, ఆయన పాలనలో సంస్థ భ్రష్టుపట్టిపోతోందని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అక్టోబర్ 14న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు.

కమిషన్ల లెక్కలు తేలకపోవడం వల్లే నైని టెండర్లను ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నైని కుంభకోణాన్ని ఆపి రూ.30,000 కోట్లు ఆదా చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పెద్దల మధ్య వాటాలు తేలనప్పుడే ఇలాంటి కుంభకోణాలు బయటకు వస్తాయని ఎద్దేవా చేశారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే కొత్త నిబంధన పేరుతో సింగరేణిలో సుమారు రూ.10,000 కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. దీనితో పాటు సోలార్, జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్లు, మరో నాలుగైదు అంశాల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

సింగరేణి కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ అక్రమాలపై ఆధారాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే సింగరేణిలో జరుగుతున్న దోపిడీపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటూ, కమిషన్ల కోసం సింగరేణిని కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Advertisement
KTR
Singareni Collieries
Revanth Reddy
Telangana Congress Government
Naini Coal Block Scam
Godavarikhani Garjana

More Telugu News