రైతు డిస్కమ్‌పై హరీశ్ రావు ఫైర్.. ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రేనని ఆరోపణ

రైతు డిస్కమ్‌పై హరీశ్ రావు ఫైర్.. ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రేనని ఆరోపణ

Harish Rao slams Raithu Discom and alleges conspiracy to end free electricity
  • రైతు డిస్కమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో 17 జారీ
  • ఇది ఉచిత విద్యుత్‌ను నీరుగార్చే కుట్రేనని ఆరోపించిన హరీశ్ రావు
  • జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • సౌర, జల విద్యుత్‌పై ఆధారపడి 24 గంటల కరెంట్ ఎలా సాధ్యమని ప్రశ్న
  • కొత్త డిస్కమ్‌పై అప్పుల భారం మోపడంపై ఆందోళన
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా 'రైతు డిస్కమ్' ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 17పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను దూరం చేసే కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, రైతుల అభ్యంతరాలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని హరీశ్ విమర్శించారు. "రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనం. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, అన్నదాత మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర?" అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ జీవో ప్రకారం 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 ఎత్తిపోతల పథకాలతో పాటు HMWSSB, మిషన్ భగీరథ కనెక్షన్లు కలిపి మొత్తం 30,62,853 కనెక్షన్లను కొత్త డిస్కమ్‌కు బదిలీ చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. ఇంత పెద్ద వ్యవస్థను కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

కొత్త డిస్కమ్‌కు కేవలం 25 శాతం థర్మల్ విద్యుత్‌ను కేటాయించి, 58 శాతం సౌర, మిగిలింది జల విద్యుత్‌పై ఆధారపడటం అవివేకమన్నారు. సౌర విద్యుత్ పగలు మాత్రమే అందుబాటులో ఉంటుందని, జల విద్యుత్ ఏడాదిలో మూడు, నాలుగు నెలలే లభిస్తుందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమవుతుందని సందేహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడే సంస్థపై అప్పులు, బకాయిల భారం మోపడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తే రైతుల కరెంట్ కష్టాలు తీరవని, వెంటనే జీవో 17ను వెనక్కి తీసుకుని, ఉచిత విద్యుత్ కొనసాగింపుపై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
Advertisement
Harish Rao
Raithu Discom
Telangana Free Electricity
GO 17 Telangana
Telangana Congress Government
BRS Party Telangana

More Telugu News