కెరీర్ పీక్స్‌లో ఉండగా యాక్టింగ్ ఆపేసిన జయా.. అసలు కారణం ఇదే!
Add ap7am to your home Screen

కెరీర్ పీక్స్‌లో ఉండగా యాక్టింగ్ ఆపేసిన జయా.. అసలు కారణం ఇదే!

  • పెళ్లి తర్వాత నటనకు ఎందుకు దూరమయ్యారో వెల్లడించిన జయాబచ్చన్
  • తనకు 9-5 ఉద్యోగం చేసే భార్య వద్దని అమితాబ్ చెప్పినట్లు వెల్లడి
  • పిల్లల కోసం ఎవరో ఒక పేరెంట్ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం
  • 'నువ్వు షూటింగ్‌కు వెళ్లొద్దు' అంటూ కూతురు శ్వేత అడిగిన మాటలు గుర్తుచేసుకున్న జయా
బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారో గతంలో వెల్లడించింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను 2007లో 'కాఫీ విత్ కరణ్' షోలో పంచుకొంది. ఈ పాత ఇంటర్వ్యూలోని విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ షోలో కరణ్ జోహార్.. "నటనను ఎందుకు వదిలేశారు?" అని అడిగిన ప్రశ్నకు జయా బదులిచ్చింది. "నాకు 9-5 ఉద్యోగం చేసే భార్య వద్దని అమితాబ్ నాతో చెప్పారు. అప్పట్లో ఆయన సినిమాలతో చాలా బిజీగా ఉండేవారు. దాంతో పిల్లల కోసం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను" అని జయా వివరించింది.

ఈ సందర్భంగా తన కూతురు శ్వేతకు సంబంధించిన ఓ భావోద్వేగ సంఘటనను కూడా ఆమె గుర్తుచేసుకుంది. "ఒకసారి నేను షూటింగ్‌కు సిద్ధమవుతుంటే శ్వేత నా దగ్గరకు వచ్చి 'ఎక్కడికి వెళ్తున్నావ్? నువ్వు వెళ్లొద్దు.. నాన్నను వెళ్లనివ్వు.. నువ్వు మాత్రం వెళ్లకు' అని అంది. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి" అని జయా బచ్చన్ తెలిపింది.

1971లో 'గుడ్డి' చిత్రంతో తెరంగేట్రం చేసిన జయా బచ్చన్.. 'జంజీర్', 'అభిమాన్', 'షోలే', 'సిల్సిలా' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 1973లో అమితాబ్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఆమె కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చింది. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 1998లో 'హజార్ చౌరాసీ కీ మా' చిత్రంతో నటనలో పునరాగమనం చేసింది.
Advertisement

More Telugu News