ధరల పెరుగుదలకు మేం కారణం కాదు: ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన జెలెన్‌స్కీ
Add ap7am to your home Screen

ధరల పెరుగుదలకు మేం కారణం కాదు: ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన జెలెన్‌స్కీ

Volodymyr Zelenskyy refutes Donald Trump allegations on fuel price hikes
  • పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనమే కారణమని స్పష్టం చేసిన జెలెన్‌స్కీ
  • రష్యా దాడులు ఆపితే ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేస్తామంటూ ప్రతిపాదన
  • ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన ‘ఎనర్జీ కాల్పుల విరమణ’పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ
  • 60 రోజుల కాల్పుల విరమణ ఇస్తే ఎన్నికలు నిర్వహిస్తామని మరో ఆఫర్
అమెరికాలో ఇంధన ధరల పెరుగుదలకు ఉక్రెయినే కారణమంటూ వస్తున్న ఆరోపణలను ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియా సంక్షోభం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చేస్తున్న విమర్శలకు జెలెన్‌స్కీ దీటుగా బదులిచ్చారు.

"పుతిన్‌ను ఎలా అడ్డుకోవాలో వారికి తెలియదు. బలహీనులపై ఒత్తిడి తీసుకురావడం సులభం కాబట్టి, ఇంధన ధరల పెరుగుదలను ఉక్రెయిన్‌తో ముడిపెట్టి మాట్లాడుతున్నారు" అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడుల కారణంగానే అమెరికాలో డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ దాడుల వల్ల అమెరికా రైతులు, పాడి పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వీటిని నిలిపివేయాలని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్‌స్కీ, 'ఇంధన కాల్పుల విరమణ'కు తాము సిద్ధమని ప్రకటించారు. రష్యా గనుక తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తే, తాము కూడా రష్యా ఇంధన కేంద్రాలపై దాడులను ఆపేస్తామని ప్రతిపాదించారు. "మాపై దాడులు ఆపండి, మా పిల్లలను చంపకండి.. అప్పుడు మేము కూడా మీ డీజిల్ కేంద్రాలపై దాడులు నిలిపివేస్తాం. ఇదొక సరైన ఒప్పందం అవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల్లోనే రష్యా తమ విద్యుత్ రంగంపై 196 సార్లు, చమురు, గ్యాస్ కేంద్రాలపై 20 సార్లు దాడులు చేసిందని, ఈ ఘటనల్లో 153 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జెలెన్‌స్కీ వివరించారు.

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో స్పందిస్తూ.. "రష్యా, ఉక్రెయిన్ మధ్య తక్షణమే 'ఇంధన కాల్పుల విరమణ' అమల్లోకి వచ్చింది. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి" అని పోస్ట్ చేయడం గమనార్హం. అయితే, ఈ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించిందని, మాస్కో నుంచి దీనిపై ఎటువంటి సమాచారం లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో కొత్త అధ్యక్షుడు రావాలన్న ట్రంప్ పిలుపునకు బదులిస్తూ.. 60 రోజుల పాటు సంపూర్ణ కాల్పుల విరమణ ప్రకటిస్తే, దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమని జెలెన్‌స్కీ మరో ప్రతిపాదన చేశారు.
Advertisement
Volodymyr Zelenskyy
Donald Trump
Ukraine Russia War
Fuel Price Hike
Energy Ceasefire
Russian Oil Refineries

More Telugu News