లోన్‌ తీసుకున్నవారికి షాక్‌.. మరో 0.75 శాతం పెరగనున్న వడ్డీ రేట్లు?
Add ap7am to your home Screen

లోన్‌ తీసుకున్నవారికి షాక్‌.. మరో 0.75 శాతం పెరగనున్న వడ్డీ రేట్లు?

RBI interest rates to rise by 075 percent shock to borrowers
  • 2027 జూన్‌ నాటికి ఆర్బీఐ మూడు విడతల్లో రేట్లు పెంచవచ్చని అంచనా
  • మొత్తం 0.75 శాతం మేర వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న గోల్డ్‌మన్‌ శాక్స్‌
  • భారత్‌ ఆర్థిక వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని అంచనా
  • 2027లో ఎల్‌నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం
  • జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గితే రబీ పంటలకు ముప్పని వెల్లడి
రుణాలపై వడ్డీ భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌’ (ఆర్బీఐ) 2027 జూన్‌ నాటికి మరో మూడు విడతల్లో వడ్డీ రేట్లు పెంచవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. మొత్తం 0.75 శాతం మేర పెంపు ఉండొచ్చని సంస్థ భారత విభాగం ముఖ్య ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా వెల్లడించారు. డిసెంబరు, ఫిబ్రవరి, ఏప్రిల్‌ లేదా జూన్‌లో ఈ పెంపులు ఉండవచ్చని పేర్కొన్నారు.

వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాత్రం దాదాపు 7 శాతంగా కొనసాగవచ్చని సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌.. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధిని సాధించడం విశేషమని పేర్కొన్నారు.

2027లో ఎల్‌నినో ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. దీనివల్ల ఆర్థిక వృద్ధికి విఘాతం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత నిల్వలు సమీప భవిష్యత్తులో ధరల పెరుగుదలను కొంతవరకు అదుపులో ఉంచగలవని వివరించారు.

ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గితే రబీ పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని సేన్‌గుప్తా తెలిపారు. 2027 నాటికి ఆహార నిల్వలు తగ్గితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ వాతావరణ ముప్పును మార్కెట్లు ఇంకా పూర్తిస్థాయిలో అంచనా వేయలేదని అభిప్రాయపడ్డారు.

ముడిచమురు ధరలు కూడా కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యారెల్‌ ధర 85 నుంచి 95 డాలర్ల మధ్య ఉంటుందన్న అంచనాలున్నాయని, అదే 100 డాలర్లకు పైన దీర్ఘకాలం కొనసాగితే వృద్ధి, ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పడుతుందని వివరించారు. జీఎస్టీ లేదా ఆదాయపు పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు అదనపు ఊతమిచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్నాయని సేన్‌గుప్తా పేర్కొన్నారు.
Advertisement
Reserve Bank of India
Goldman Sachs
Interest Rate Hike
Indian Economy
Santanu Sengupta
Inflation

More Telugu News