పార్టీ పరువు తీయొద్దు: కొలికపూడి, బాలకోటయ్యకు టీడీపీ హైకమాండ్ వార్నింగ్

పార్టీ పరువు తీయొద్దు: కొలికపూడి, బాలకోటయ్యకు టీడీపీ హైకమాండ్ వార్నింగ్

  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, బాలకోటయ్య మధ్య ముదిరిన వివాదం
  • కొలికపూడి, బాలకోటయ్యను పిలిపించుకుని మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు
  • వ్యక్తిగత విభేదాలను ఎస్సీ ఉప కులాల మధ్య గొడవగా మార్చవద్దని హెచ్చరిక
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శల యుద్ధానికి తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అడ్డుకట్ట వేసింది. ఇరువురి మధ్య ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని భావించి, వారిని హెచ్చరించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరు నేతలతో వేర్వేరుగా మాట్లాడి వివరణ కోరారు.

ఎస్సీ వర్గానికి చెందిన ఓ పీఈటీని తన ఇంటికి పిలిపించి, ఎమ్మెల్యే కొలికపూడి దూషించి, కర్రతో దాడి చేశారని బాలకోటయ్య పార్టీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది. అయితే ఈ ఆరోపణలను కొలికపూడి తీవ్రంగా ఖండించారు. బాలకోటయ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వార్తాపత్రికల్లో రావడంతో... పార్టీ అధినేత చంద్రబాబు ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో, పల్లా శ్రీనివాసరావు బాలకోటయ్యతో పార్టీ కార్యాలయంలో, కొలికపూడితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వ్యక్తిగత విభేదాలను రెండు ఎస్సీ ఉప కులాల మధ్య గొడవగా మార్చవద్దని, ఇలాంటి ప్రవర్తనను పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. అంతర్గత సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, పార్టీ పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు.
Advertisement

More Telugu News