ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వద్దు.. రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వద్దు.. రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

Chandrababu Naidu reviews Amaravati capital works and issues key orders
  • నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేయాలని లక్ష్యం
  • గత నెలలో రూ.1,345 కోట్ల పనులు జరిగాయని అధికారులు వెల్లడి
  • ఔటర్ రింగ్ రోడ్డుపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం
  • ప్రస్తుతం 41 వేల మంది కార్మికులతో కొనసాగుతున్న పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి నెలా కనీసం రూ. 2 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

గత నెలలో రాజధాని పరిధిలో రూ. 1,345 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదించారు. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలంటే పనుల వేగాన్ని మరింత పెంచాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం అమరావతిలో 152 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 41 వేల మంది కార్మికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని మంత్రి నారాయణ వివరించారు. వివిధ నిర్మాణ సంస్థలు చేపట్టిన పనుల పురోగతిని సీఎం స్వయంగా ఆరా తీశారు.

రాజధాని అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చోటుచేసుకోకూడదని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Amaravati Capital Works
Andhra Pradesh Development
Amaravati Outer Ring Road

More Telugu News