'ది ట్రెయిటర్స్'.. 20 మంది సెలబ్రిటీలతో సరికొత్త రియాలిటీ షో.. హోస్ట్‌గా తేజ సజ్జా

'ది ట్రెయిటర్స్'.. 20 మంది సెలబ్రిటీలతో సరికొత్త రియాలిటీ షో.. హోస్ట్‌గా తేజ సజ్జా

Teja Sajja to host The Traitors Telugu reality show with 20 celebrities
  • హోస్ట్‌గా మారిన యంగ్ హీరో తేజ సజ్జా
  • ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న 'ది ట్రెయిటర్స్ తెలుగు'
  • 20 మంది ప్రముఖ సెలబ్రిటీలతో సరికొత్త రియాలిటీ షో
  • ఈ గేమ్ నాక్కూడా అనూహ్యమేనంటున్న తేజ సజ్జా
  • తాజాగా విడుదలైన 'ది ట్రెయిటర్స్ తెలుగు' ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా సరికొత్త అవతారంలోకి మారారు. నటుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన, ఇప్పుడు హోస్ట్‌గా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న 'ది ట్రెయిటర్స్ తెలుగు' అనే రియాలిటీ షోకు తేజ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. "మోసం ఇక్కడ కొత్త రూల్" అనేది క్యాప్షన్. మంగళవారం ఈ షోకు సంబంధించిన ట్రైలర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన 'ది ట్రెయిటర్స్' ఫార్మాట్‌ను తొలిసారిగా తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ షోలో వివిధ రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. వారిలో సింగర్ చిన్మయి శ్రీపాద, నటులు హర్షవర్ధన్, ప్రగతి, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుల్లత రామన్, విష్ణు ఓయ్, సాయి రోనక్ వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు.

ఈ షో గురించి తేజ సజ్జా మాట్లాడుతూ.. "'ది ట్రెయిటర్స్ తెలుగు'కు హోస్ట్‌గా వ్యవహరించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. ఇప్పటివరకు నేను చేసిన వాటికి ఇది పూర్తి భిన్నమైనది కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక ఫార్మాట్‌ను తొలిసారి తెలుగులోకి మన అభిరుచికి తగ్గట్టుగా తీసుకురావడం సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

"నిజం చెప్పాలంటే, ఈ గేమ్ కంటెస్టెంట్స్‌కు ఎంత అనూహ్యమో, హోస్ట్‌గా నాక్కూడా అంతే అనూహ్యం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో క్షణాల్లో మారిపోతుంది. అబద్ధాలు, మైండ్ గేమ్స్, ఊహించని పొత్తులతో ఈ షో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ షోతో ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను," అని తేజ వివరించారు. అబద్ధాలు, నమ్మకద్రోహాల మధ్య సాగే ఈ సైకలాజికల్ గేమ్ షో త్వరలోనే ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
Advertisement
Teja Sajja
The Traitors Telugu
Prime Video Reality Show
Teja Sajja Host
The Traitors Telugu Contestants
Telugu Psychological Game Show

More Telugu News