రాయలసీమ పౌరుషమంటే గొడ్డలి పోట్లు కాదు.. అభివృద్ధి: పవన్ కల్యాణ్

రాయలసీమ పౌరుషమంటే గొడ్డలి పోట్లు కాదు.. అభివృద్ధి: పవన్ కల్యాణ్

Rayalaseema pride is about development not axe attacks says Pawan Kalyan
  • రాయలసీమ పౌరుషమంటే గొడ్డలి పోట్లు కాదని, అభివృద్ధి అని పవన్ కల్యాణ్ వ్యాఖ్య
  • ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్లతో అమరజీవి జలధార పథకానికి శ్రీకారం
  • గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులను నిర్వీర్యం చేసిందని తీవ్ర విమర్శ
  • పులివెందుల, అరకులోనూ వివక్ష లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడి
  • ఇది కక్షసాధింపుల ప్రభుత్వం కాదు, ప్రజాభివృద్ధి ప్రభుత్వమని స్పష్టీకరణ
"యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు నా గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం" అంటూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఈ నేల రూపురేఖలను అభివృద్ధి పథంలో మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రూ.30,156 కోట్ల విలువైన 'అమరజీవి జలధార' పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద ఈ బృహత్తర తాగునీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 24,601 ఆవాసాల్లో 50,315 పనులను ఈ పథకం కింద చేపట్టనున్నట్లు వివరించారు. 

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'హర్ ఘర్ జల్ - జలజీవన్ మిషన్'కు 2019-24 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచింది. రూ.26,000 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపి, ఐదేళ్లలో కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ప్రజల తాగునీటి కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు" అని దుయ్యబట్టారు.

2024లో ఈ పథకం ముగిసిపోవాల్సిన తరుణంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సి.ఆర్. పాటిల్, నిర్మలా సీతారామన్‌లను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. వారి సహకారంతో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, పనులను వేగవంతం చేశామని తెలిపారు. "గత ప్రభుత్వం ఖర్చు చేయగా మిగిలిన పనులతో పాటు, ఇప్పటికే మేము రూ.4,500 కోట్ల విలువైన పనులను పూర్తి చేశాం. మీరు మాపై ఉంచిన నమ్మకమే మాకు శ్రీరామరక్ష" అని పవన్ పేర్కొన్నారు.

తమది కక్షసాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజాభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుందని పవన్ స్పష్టం చేశారు. "దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పులివెందుల నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పథకాలకు రూ.280 కోట్లు కేటాయించి 7 మండలాల్లోని 299 గ్రామాలకు నీరందిస్తున్నాం. అలాగే, వైసీపీ ఎంపీ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. మాకు పార్టీలు కాదు, ప్రజల సమస్యలే ముఖ్యం" అని ఉద్ఘాటించారు.

గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీకి మద్దతిచ్చారనే కారణంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం గ్రామ ప్రజలను నాటి శాసనసభ్యుడు తీవ్రంగా అవమానించారని, వారి వినతిపత్రాన్ని కళ్లెదుటే నలిపి పడేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామాల అభివృద్ధి కోసం తక్షణమే రూ.3.5 కోట్లతో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించారు.

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని గణాంకాలతో వివరించారు. "రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్ల సామర్థ్యానికి అదనంగా 50 శాతం నుంచి 175 శాతం వరకు కేవలం ఈ ఐదేళ్లలోనే నిర్మించబోతున్నాం" అని తెలిపారు. నీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Pawan Kalyan
Rayalaseema Development
Amarajeevi Jaladhara Scheme
Chandrababu Naidu
Kadapa Proddutur
Andhra Pradesh Drinking Water Project

More Telugu News